గుజరాత్ వడోదరలోని డాక్టర్ ఆర్.బి.భిసానియా వెరీ పాపులర్. ఇటీవలే ఆయన కుమార్తె వివాహం జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులంతా ఉత్తచేతులతోనే వచ్చారు. గిఫ్టులేమీ పట్టకెళ్లలేదు. కానీ, వారు వధూవరులను ఆశీర్వదించిన తర్వాత పెళ్లికి వెళ్లిన వారు ఏం చేశారో తెలుసా?... రక్తదానం చేశారు.
దాంతోపాటే, అవయవదానం ప్రతిజ్ఞ చేశారు. ఆ విధంగా, మానవత్వాన్నే బహుమతులుగా ఇచ్చారు. దీనికంతటికీ వధువు తండ్రి డాక్టర్ భిసానియానే కారణం. ఆయన అతిథులందరికీ ముందే చెప్పారు... గిఫ్టులు ఏవీ వద్దని, చేయదలిస్తే రక్తదానం, అవయవదానం ప్రతిజ్ఞ చేయమని విజ్ఞప్తి చేశారు.
దీనిపై డాక్టర్ భిసానియా మాట్లాడుతూ, రక్తదానం, అవయవదానంపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ ఆలోచన చేశామని చెప్పారు. తన కుమార్తె డాక్టర్ ధ్వని, అల్లుడు డాక్టర్ జయ్ పాండ్య కూడా దానానికి ముందుకువచ్చారని పేర్కొన్నారు.