శని అనే మాట వినగానే అందరిలో అలజడి మెుదలవుతుంది. సాధారణ మానవులే కాదు దేవతలు కూడా శనీశ్వరుడంటే భయపడుతుంటారు. శని దేవునికి శనివారం అంటే చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున శనీర్వునికి పూజలు చేయడం వలన శనిగ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. అయితే కొంతమంది శని త్రయోదని రోజున శని దేవుడిని ఎందుకు పూజించాలనే సందేహం కలుగుతుంటుంది.
అందుకు ముఖ్యకారణం సూర్యుడు - సంజ్ఞాదేవి దంపతులకు వైవస్వతుడు, యమధర్మరాజు జన్మించారు. సూర్యుని వేడిని భరించలేని సంజ్ఞాదేవి తన నీడకి ప్రాణం పోసి పుట్టింటికి వెళ్లిపోతుంది. ఆ నీడనే ఛాయాదేవి అని పిలుస్తుంటారు. సూర్యుని వలన ఆమె సావర్ణి మనువుకు శనీశ్వరునికి జన్మనిచ్చింది. ఆ రోజే శని త్రయోదశి. ఈ కారణంగానే శనివారంతో కూడిన ఈ త్రయోదశి రోజున శని దేవునికి పూజలు చేస్తుంటారు.
ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి శనిశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అదే నూనెతో అభిషేకం చేయాలి. ఆ తరువాత నువ్వుల నూనెతో వంటకాలు తయారుచేసి ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. ఇదే రోజున నువ్వులను, నల్లని వస్త్రాలను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన వాహనమైన కాకికి ఈ రోజున ఆహారాన్ని ఏర్పాటు చేయాలి.
ఏలినాటి శనిదోషాలలో బాధపడుతున్నవారు వరుసగా 13 శనివారాలు శనిదేవునికి పూజలు చేయవలసి ఉంటుంది. ఇలా ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరునికి దీపారాధనలు, నైవేద్యాలు పెట్టడం వలన ఏలినాటి శనిగ్రహాదోషాలు తొలగిపోతాయని పురాణంలో చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి శనివారం రోజున హనుమంతునికి సింధూరాభిషేకం చేయించడం కూడా మంచి ఫలితం ఉంటుంది.