వైకుంఠ ఏకాదశి రోజున బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదా? శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది ఈ రోజే..
మంగళవారం, 3 జనవరి 2017 (09:31 IST)
వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తీసుకోకూడట. అన్నం తీసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే పర్వదినం వైకుంఠ ఏకాదశి. ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవాలయాన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటారు.
ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు. సాధారణంలో ఒక్క ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు.
ఆరోజున ఉత్తరద్వార దర్శనం చేసుకునే వారికి పుణ్యఫలం సిద్ధిస్తుంది. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు.
దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూటవిషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఇదే రోజునే. ఇక మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగు మార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది. ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లూ ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం.
అందుకే వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠతో విష్ణుమూర్తిని దర్శించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయి. వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు. ముర అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని విశ్వాసం. అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువును షోడ శోపచారాలతో ఆరాధించి, చాలామంది ఉపవాసం చేస్తారు.
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేయాలి. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
ఏకాదశి వ్రతం నియమాలు : 1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్యం పలుకకూడదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి.
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెప్తున్నాయి.
అలాగే కృతయుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.
అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.