భక్తుడికి సంతోషాన్ని కలిగించడం కోసం వైకుంఠం నుంచి వచ్చిన స్వామి, భక్తుల కష్టనష్టాలను తీరుస్తూ సత్యమహిమ కలిగిన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. తపస్సుల ద్వారా తప్ప పొందలేని స్వామి అనుగ్రహం, ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
సత్యనారాయణస్వామి వ్రతాన్నే సత్యవ్రతంగా కూడా పిలుస్తుంటారు. ఒకసారి సంకల్పించుకుంటే ఆ స్వామి వ్రతం చేసి తీరవలసిందే. వాయిదా వేయడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందనేది ఆ వ్రత కథల్లోనే కనిపిస్తుంది. అంకితభావంతో... నియమనిష్టలతో ఈ వ్రతం చేసినవారిని స్వామి వెంటనే అనుగ్రహిస్తాడనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.