కలియుగ వైకుంఠం, శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో గురు, శుక్రవారాలు ప్రత్యేకమని తెలిసిందే. గురువారం రోజున శ్రీవారి నేత్ర దర్శనం చేసుకునే వారికి సకల సంపదలు చేకూరి, సజ్జనులుగా జీవిస్తారని విశ్వాసం. గురువారం రోజున ధవళ వస్త్రాలతో, నేత్ర దర్శనమిచ్చే వెంకన్న స్వామిని దర్శించుకునే వారికి మనోధైర్యం, భోగభాగ్యాలు, సిరిసంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. శుక్రవారం నాడు శ్రీవారికి ఆగమ శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించే వారికి ఈతి బాధలు తొలగిపోయి శ్రీమన్నారాయణ, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
శుక్రవారం శ్రీవారి నిజపాద దర్శనం:
తిరుమల ఏడు కొండలపై శుక్రవారం శ్రీవారి నిజపాద దర్శనం ఉంటుంది. గురువారం స్వామి వారికి ధరించే ధవళ వస్త్రాలను తొలగించి అభిషేక, ప్రత్యేక పూజలకు అనంతరం పట్టు వస్త్రధారణ జరుగుతుంది. దీనితో పాటు స్వామివారి నిజపాద దర్శనం కూడా ఉంటుంది.
ఈ రోజున పట్టు పంచె, పట్టు తలపాగా, బుగ్గన చుక్కతో గోకుల విహారి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. భక్తుల కొంగు బంగారమైన వేంకటాచలపతి శుక్రవారం పూట దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని తితిదే పురోహితులు చెబుతున్నారు.