గంధపు బొట్టు వలన ఉపయోగం ఏంటి...? ఆరోగ్య రహస్యాలు...

బుధవారం, 7 డిశెంబరు 2016 (21:57 IST)
సువాసన గల గంధపుచెక్కతో గంధపు సానపైన తీసిన గంధంతోనే బొట్టు పెట్టుకోవాలి. అదే శ్రేష్టమైనది. చిన్నచిన్న డబ్బాల్లో పెట్టి అమ్మే గంధపుపొడి ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. దానిలోను కెమికల్స్ కలుపుతుండటం వలన ముఖం మీద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. గంధాన్ని మొదట దేవునికి పెట్టి ప్రసాద బుద్ధితో పెట్టుకోవాలి. దేవతలకు గంధాన్ని సమర్పిస్తే సంతోషించి అనుగ్రహిస్తారని మన పూర్వీకులు చెబుతారు. మహాపాప పరిహారానికి సాలగ్రామశిలపై ఉంచిన గంధాన్ని పూసుకోవాలని పురాణాలు చెపుతున్నాయి.
 
సాలగ్రామశిలాలగ్న చందనం ధారయేత్సదా
సర్వాంచేషు మహాపాపశుద్ధయే కమలాసన.
హిందూ సంప్రదాయ ప్రకారం సీమంత సమయంలో స్త్రీలకు గంధాన్ని పూస్తారు. అది పుట్టే బిడ్డకు ఆరోగ్యకరం.
 
గంధములో ఉండే గుణాలు
నొసటన గంధం పూయడం వల్ల మెదడు చల్లబడుతుంది. కోపావేశం అణగుతుంది. శాంతి చేకూరుతుంది. తలపైన గంధం పూయడం వల్ల మనస్సు ఏకాగ్రత కుదురుతుంది. లలాట ప్రదేశంలో పూయడం వలన కనుబొమల ముడిమధ్య కేంద్రీకరించిన జ్ఞాన తంత్రులకు స్ఫూర్తి కలుగుతుంది. సంకల్ప శక్తి దృఢపడుతుంది. అవయవాలన్నీ చురుకుగా పనిచేస్తాయి. గంధం పూసుకోవడం వల్ల ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం సుగమమవుతుందని చెపుతారు. గంధ ధారణ వల్ల గలిగే ఆధ్యాత్మిక లాభాన్ని కఠోపనిషత్తు వివరించింది. అంతేకాదు చందన లేపం అన్నివిధాల ఆరోగ్యాన్ని కలిగిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

వెబ్దునియా పై చదవండి