తెలంగాణా రాష్ట్రంలోని 13 రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం గట్టి షాకివ్వనుంది. గత ఆరేళ్లుగా ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని 13 పార్టీల గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించింది. గత ఆరేళ్ళుగా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా, కేవలం గుర్తింపు పార్టీలుగా కొనసాగుతున్నందున ఈ 13 పార్టీలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇదే అంశంపై ఆయా పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది.
ఇదే విషయంపై దినపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వాలని కూడా జిల్లా అధికారులను ఆదేశించింది. ఆయా పార్టీల నుంచి వివరణ స్వీకరించిన తర్వాత వాటి గుర్తింపును రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై స్పష్టమైన సిఫార్సులతో కూడిన నివేదికను ఈ నెల 10వ తేదీనలోగా సమర్పించాలని స్పష్టం చేసింది. జిల్లాల నుంచి అందిన నివేదిక ఆధారంగా తుది నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు.
గుర్తింపు రద్దు నోటీసులు అందుకోనున్న రాజకీయ పార్టీల వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ, ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ, జాగో పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ కాంగ్రెస్, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ, తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం, యువ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజా సమితి పార్టీలు ఉన్నాయి.