ఆదిదంపతులచే పూజలందుకున్న మాళికాపురత్తమ్మ!!

సోమవారం, 10 జనవరి 2011 (16:11 IST)
FILE
అమ్మలగన్న అమ్మ, జగజ్జనని పార్వతీదేవి పాలసముద్ర మధన సందర్భంగా జనించిన విషాన్ని లోకరక్షణకై తన భర్తనే మింగమని చెబుతోంది. ఆ సందర్భంగానే విష్ణుమూర్తికి శనిదోషం పట్టుకుంటుంది. విష్ణుమూర్తిని రక్షించే ప్రయత్నంలో శివపార్వతులు కోయదంపతుల రూపంలో శబరిమలలోని మాళికాపురత్తమ్మ ఆలయాన్ని దర్శించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

శబరి మలలోని మాళికాపురత్తమ్మ ఆలయంలో శనిదోష పూజలు నేటికీ జరుగుతున్నాయి. ఆదిదంపతులు ఆచరించినట్లు కోయదంపతుల ఘట్టాన్ని ఇక్కడి కోయవాళ్లూ నేటికీ ఆచరిస్తూ మాళికాపురత్తమ్మ ఆలయంలో పరకోటి పాటు (ఢంకా భజిస్తూ) పాడతారు. దీనివలన శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. అందుకే ఈ ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరై శనిగ్రహదోష నివారణ పొందుతుంటారు. ఇంకా మాళికాపురత్తమ్మ సన్నిధిలో గల నాగరాజాలయంలోనూ సర్పదోష పరిహార పూజలు నిర్వహిస్తారు.

లోకకళ్యాణం తర్వాతే తన కళ్యాణం జరుగుతుందని దీక్ష వహించిన అయ్యప్పస్వామి దీక్ష పూర్తి చేసుకుని ఎప్పుడు తనను వివాహం చేసుకుంటాడా అని ఎదురుచూస్తుంటుంది మాళికాపురత్తమ్మ. స్వామి కృపవల్ల సుందరాకారం పొందిన ఆమె సన్నిధికూడా శబరిమలలోనే ఉంది.

అళుద నదీ తీరంలో మహిషి రూపంలో సంచరిస్తుండే రాక్షసి అయిన ఈమెను అయ్యప్ప స్వామి ఎదుర్కొని ఆమె గర్వం అణిచాడు. అయ్యప్ప చేతి స్పర్శ తాకిన వెంటనే అంగగత్తెగా, పవిత్రరాలుగా మారిన ఈమె శరణుఘోషతో స్వామి వారిని అర్చించింది. ఆయన రూపాన్ని చూసి తన్మయత్వం చెంది, తనను వివాహమాడాల్సిందిగా కోరింది. అందుకు అయ్యప్ప స్వామి "ఏ రోజున నా సన్నిధికి కన్నెస్వాములు (తొలిసారిగా శబరిమలకు వచ్చే వారిని కన్నెస్వాములు అంటారు) రావడం ఆగిపోతారో ఆనాడు నిన్ను వివాహమాడతాను అని సెలవిచ్చారు.

అప్పటినుంచి మాళికాపురత్తమ్మ అయ్యప్పకోసం శబరిమలలోనే ఒక ప్రత్యేకమైన సన్నిధిలో వేచి ఉంది. శబరిమలకు వచ్చే కన్నెస్వాములు తమవెంట ఒక కొయ్యబాణం తీసుకువస్తారు. స్వామి దర్శనం పూర్తయిన తర్వాత ఆ బాణాన్ని సరంకుత్తిఅల్ అనే ప్రదేశంలో విసురుతారు. మకరదీపం పూర్తయిన తర్వాత మూడురోజుల పాటు మాళికాపురత్తమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి ఆ తర్వాత అమ్మవారిని ఊరేగింపుగా సరంకుత్తిఅల్ ప్రాంతానికి తీసుకువస్తారు.

శబరిమలకు కన్నెస్వాములెవరైనా వచ్చారా? లేదా? అని తెలుసుకోడానికే అమ్మవారు ఇక్కడ వేంచేస్తారన్నమాట. తీరా అక్కడ వేలాది బాణాలు పడి ఉండటం చూసి నిరాశతో వచ్చే ఏడాది వరకూ వేచి చూద్దాం అనుకుని అమ్మవారు వెనక్కు వెళ్లి తన సన్నిధికి చేరుకుంటుంది. ఇలా కన్నె స్వాముల ఆగమనం రోజు రోజుకూ పెరుగుతుండడాన్ని కూడా విజ్ఞులు, భక్తి భావం, లోకకళ్యాణంతో ముడిపెడుతుంటారు. అయ్యప్ప స్వామివారి సన్నిధికి వచ్చే ముందు జనం వహించే దీక్ష, భక్తిమార్గం వారిని సజ్జనులుగా తీర్చిదిద్దుతాయి.

అందుకే అయ్యప్ప భక్తులు మార్గశిర మాసంలో వేకువజామున చన్నీటితో తలస్నానమాచరించి శరణు చెప్పుకుని ఆ తర్వాత తమ దైనందిన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలా చేయడం వల్ల మనోబలం చేకూరి సకల కార్యాలు సిద్ధించడమేకాక ముఖవర్చస్సు పెంపొందుతుంది. వారిలో తేజస్సు ప్రస్ఫుటమౌతోందని పురోహితులు చెబుతున్నారు. ఇలా సన్మార్గవంతులై శబరిమలకు వెళ్లి స్వామివారి దివ్యాశీస్సులు పొంది భక్తులు పరిపూర్ణత్వాన్ని పొందుతారు.

ఈ సందేశంతోనే మాళికాపురత్తమ్మకు స్వామివారు ఆ నిబంధన విధించారు. అంతవరకు లోకకళ్యాణ దీక్షాపరుడైన అయ్యప్ప స్వామి స్వకళ్యామంపై దృష్టిసారించడు. కానీ శబరి గిరీశుడి ఆజ్ఞను శిరసా వహించి జనహితం తర్వాతే తన హితంగా తాను వివాహం చేసుకోదలచి ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న మహా త్యాగశీలి, సహనమూర్తియైన మాళికాపురత్తమ్మను సేవించడం ద్వారా ఈతిబాధలు, శనిదోషాలు తొలగిపోయి సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి