ఆ ఆలయంలోకి 4 శతాబ్దాల తర్వాత పురుషులకు ప్రవేశం

సోమవారం, 23 ఏప్రియల్ 2018 (15:02 IST)
ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఉన్న ఓ ఆలయంలో పురుషులకు ప్రవేశం కల్పించారు. అదీకూడా 400 యేళ్ల తర్వాత మగరాయుళ్లకు ఈ అరుదైన అవకాశం లభించింది.
 
ఒడిషా రాష్ట్రంలోని కేంద్రపారా ప్రాంతంలో ఉండే సాతభయ గ్రామానికి దగ్గర్లో మా పంచబారాహి గుడి వుంది. కొన్ని వందల ఏళ్లుగా మహిళలు మాత్రమే ఈ గుడిలోకి వెళ్లేవారు. ఐదుగురు దళిత మహిళా పూజారులు ఈ గుడి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. ఈ ఐదుగురు తప్ప మిగతా ఎవరూ అక్కడి విగ్రహాలను తాకకూడదు. 
 
పైగా, 400 ఏళ్లుగా ఒక్క పురుషుడు కూడా ఈ గుడిలోకి అడుగుపెట్టలేదు. ఈ గుడిలోని దేవత తమను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతుందని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. అయితే ఈ మధ్యే 400 ఏళ్ల చరిత్రకు ఫుల్‌స్టాప్ పెడుతూ తొలిసారి మగవాళ్లు ఈ గుడిలోకి వెళ్లారు. దీనికి కారణం సమీపంలో ఉన్న సాతభయ గ్రామానికి వరదలు వచ్చాయి. దీంతో ఈ గుడిని మరో ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. 
 
గుడిలోని గ్రానైట్ విగ్రహాలను తరలించడానికి ఆ ఐదుగురు మహిళా పూజారులు మగవాళ్ల సాయం తీసుకున్నారు. ఇందులోని ఒక్కో విగ్రహం బరువు 1.5 టన్నులు ఉండటం విశేషం. ఈ నెల 20న ఈ విగ్రహాలను 12 కిలోమీటర్ల దూరంలోని బగపాటియా గ్రామానికి తరలించారు. మగవాళ్లు ఈ విగ్రహాలను తాకడంతో కొత్త చోటుకి చేరుకోగానే మహిళా పూజారులు విగ్రహాల సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టారు. 
 
కొన్ని దశాబ్దాలుగా సాతభయ గ్రామం వరదల బారిన పడుతూనే ఉంది. క్రమంగా పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ఈ గ్రామం పాలిట శాపంగా మారాయి. 1930లో 350 చదరపు కిలోమీటర్లలో ఉన్న ఈ ప్రాంతం.. 140 చదరపు అడుగులకు కుంచించుకుపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు