ఎస్సీఎస్టీ - మత్స్యకారుల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు : తితిదే ఈవో సాంబశివరావు

మంగళవారం, 7 జూన్ 2016 (11:53 IST)
ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించనున్నట్టు తితిదే ఈవో సాంబశివరావు వెల్లడించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో అర్చక శిక్షణపై అధికారులతో ఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏజెన్సీలు, ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంతాల్లో ఉత్సాహవంతులైన యువకులను ఎంపిక చేసి అర్చక శిక్షణ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నట్టు తెలిపారు.
 
ఈ సామాజికవర్గం ప్రజలు నివశించే ప్రాంతాల్లో ఒక్కో ఆలయాన్ని 8 లక్షల రూపాయల వ్యయంతో 500 ఆలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఆయా ఆలయాల పరిధిలో స్థానికంగా ఉన్న షెడ్యూల్డ్ కులాల వారు, గిరిజనులు, మత్స్యకారులను గుర్తించి వారికి సులభంగా అర్థమయ్యేలా శాస్త్రీయ పద్దతుల్లో అర్చక శిక్షణ ఇవ్వాలని సూచించారు. 
 
ఇందుకోసం ప్రముఖ పండితుల సలహాలు తీసుకోవాలని కోరారు. శిక్షణ అనంతరం ఆయా ఆలయాల్లో వీరికి అర్చకులుగా నియమించేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అర్చక శిక్షణ కోసం పాఠ్యాశాల రూపకల్పన, ఆయా ఆలయాలకు అవసరమైన అర్చకుల ఎంపిక కోసం తిరుపతి జేఈఓ  ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అర్చక శిక్షణ కార్యక్రమాలను తితిదే శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి