భగవంతుడి దశావతారాలలో నరసింహావతారానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తవరదుడిగాను, దుష్ట శిక్షకుడిగాను, ధర్మ పరిరక్షకుడిగాను, ఆర్తులకు చేయూతనిచ్చే అసమాన దైవంగానూ భక్తజనకోటి హృదయాలలో సుస్థిర స్థానం సంపాందించుకున్న దేవుడు నరసింహస్వామి. దుష్టులను శిక్షించేటప్పుడు మాత్రమే ఉగ్రరూపంలో కనిపిస్తూ, భక్తులను అనుగ్రహించేటప్పుడు మాత్రం ఎంతో ప్రసన్నంగా కనిపించే స్వామివారికి లెక్కలేనన్ని ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో సుప్రసిద్ధమైన క్షేత్రం "యాదగిరి గుట్ట".
ఒక సుప్రసిద్ధ రుషి కుమారుడైన "యాదరుషి" పేరుతో వెలసిన దివ్య పుణ్యక్షేత్రమే ఈ యాదగిరి గుట్ట. యాదరుషి నరసింహస్వామి కోసం తపస్సు చేసిన గిరి కాబట్టి, ఇది యాదగిరి అయ్యింది. అలాగే ప్రసిద్ధికెక్కాలని యాదరుషి తనకు దర్శనమిచ్చిన "జ్వాలా నరసింహ స్వామి"వారిని వేడుకున్నట్లు స్థలపురాణం చెబుతుంది.
"యాదడు" తపస్సు ఫలితంగానే..!
యాదడు అనే కుర్రవాడు దీక్షగా తపస్సు చేస్తే, అతడికి నరసింహస్వామి ప్రత్యక్షమై, అతడి కోరిక మేరకు ఆ గుట్టమీదనే ఉండిపోయడనీ, అందువల్లనే ఆ కుర్రవాడి పేరుమీదనే "యాదగిరి గుట్ట"కు ఆ పేరు వచ్చిందని స్థానికుల విశ్వాసం...
అలాగే ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. దీనినే "విష్ణుకుండం" అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. అందుకే ఈ పవిత్ర జలాలలో ముందుగా స్నానమాచరించిన తరువాతే స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్తుంటారు.
యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో మూడు రకాలైన స్వామివారి రూపాలు మనకు దర్శనమిస్తాయి. ఒకటి ప్రహ్లాద చరిత్రకు సబంధించినది. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత స్వామివారు ప్రహ్లాదుడి కోరిక మేరకు ఉగ్రరూపాన్ని వదలి, ప్రసన్నరూపాన్ని ధరించి యాదగిరి గుట్టపై వెలిశాడు.
అలా ప్రసన్న నరసింహస్వామి రూపంగానూ, యాదరుషికి దర్శనమిచ్చిన జ్వాలా నరసింహస్వామి రూపంగానూ, యాదగిరికి వచ్చే భక్తులను అనుగ్రహిస్తూ ఉండే లక్ష్మీ నరసింహ స్వామివారి రూపంలోనూ భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ స్వామివారి పవిత్ర పాదాలను తాకేందుకే బ్రహ్మదేవుడు తెచ్చిన గంగే.. విష్ణుకుండంలోకి ఇప్పటికీ ప్రవహిస్తూ ఉందని భక్తుల విశ్వాసం. ఇక యాదగిరి గుట్ట క్షేత్ర పాలకుడిగా ఆంజనేయస్వామి పూజలందుకుంటున్నాడు.
ఈ క్షేత్ర స్థల పురాణం గురించి స్థానికులు మరో విధంగా కూడా చెబుతుంటారు. యాదడు అనే కుర్రవాడు దీక్షగా తపస్సు చేస్తే, అతడికి నరసింహస్వామి ప్రత్యక్షమై, అతడి కోరిక మేరకు ఆ గుట్టమీదనే ఉండిపోయడనీ... అందువల్లనే ఆ కుర్రవాడి పేరుమీదనే "యాదగిరి గుట్ట"కు ఆ పేరు వచ్చిందని స్థానికుల విశ్వాసం.
ముందు యాదగిరి గుట్ట ఆలయం ఇరుకైన గుహలో ఉండేది. భక్తులు బాగా వంగి పాకుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఆ తరువాత గుహను తొలిచి పెద్దదిగా చేసి, విశాలమైన హాలులా చేశారు. హాలుకు చివర స్వామివారు జ్వాలా నరసింహస్వామి పేరుతో ఒక మూర్తి, యోగ నరసింహస్వామి పేరుతో మరో మూర్తి, లక్ష్మీ నరసింహస్వామి పేరుతో మరో మూర్తిగా కొలువై ఉంటారు.
ఎలా వెళ్లాలంటే... హైదరాబాదు నుంచి కాజీపేట వైపు వెళ్లే రైలుమార్గంలో రాయగిరి అనే చిన్న రైల్వే స్టేషన్ ఉంటుంది. రాయగిరి స్టేషన్ నుంచి యాదగిరి గుట్ట 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడినుంచి ఆటోలు కోకొల్లలుగా ఉంటాయి. అయితే రాయగిరిలో అన్ని రైళ్లు ఆగవు. ఎక్స్‌ప్రెస్ రైల్లో వెళ్లేవారు పక్కనే ఉన్న భువనగిరి స్టేషన్‌లో దిగి అక్కడినుంచి బస్సులో యాదగిరి గుట్ట వెళ్లాల్సి ఉంటుంది.
ఇక హైదరాబాదు నుంచి యాదగిరి గుట్టకు సరాసరి వెళ్లే బస్సులు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే గుట్టకు చేరుకోవచ్చు. ఆలయం తూర్పు చివర చిన్న గుట్ట వంటి కొండమీదికి, కింది నుంచి పైన ఆలయం దాకా మెట్లదారి ఉంటుంది. ఆ మెట్లు దారి చిన్నపిల్లలు కూడా తేలికగా ఎక్కేలా ఉంటుంది.
వసతి విషయానికి వస్తే... గుట్టమీద ఆలయాన్ని ఆనుకునే అనేక వందల గదులు గల ఎన్నో సత్రాలు ఉంటాయి. ఇందులో కొన్ని ఉచితంగా ఇచ్చే గదులు కూడా ఉంటాయి. అద్దె గదులు వంద రూపాయలలోపు దొరుకుతుంటాయి. ఇక భోజన సౌకర్యం కోసం ఈ ప్రాంతంలోనే భక్తులను, పర్యాటకులను ఆకర్షించే విధంగా పలు రకాల హోటళ్లు ఉన్నాయి.