నా ప్రేమ అనుభవాలు: లవ్ ఎట్ ఫస్ట్ సైట్

హాయ్.... ఫ్రెండ్స్..!! నా పేరు చందు..!

నా జీవితంలో జరిగిన మధుర జ్ఞాపకాలను మీతో పంచుకునే అవకాశం కల్పించిన వెబ్‌దునియా వారికి చాలా థ్యాంక్స్.. నా అనుభవాలను ప్రచురించినందుకు ప్రత్యేకంగా ఎడిటర్ గారికి చాలా చాలా థ్యాంక్స్..!

ప్రేమ... ఓ స్వచ్ఛత.. ఓ నిర్మలత్వం.. ఓ అలజడి.. ఓ మౌనం.. ఓ తీపి గాయం...

ప్రేమ గురించి ఎంతో మంది గొప్ప గొప్ప ప్రేమికులు ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. మరి నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా.. మరీ అంత గొప్పగా కాకపోయినా నా బాషలో చెప్తాను.. "కళ్లు చేసే చిన్న తప్పుకు మనసుకు పడే తీపి యావజ్జీవ శిక్షే.. ప్రేమ" ఇలా ఎందుకన్నానో చివర్లో మీకే అర్ధమవుతుంది.

ఇక విషయానికి వచ్చేద్దాం.. అవి నా కాలేజి రోజులు చాలా సరదాగా.. సంతోషంగా గడిచిపోతున్నాయి. కొత్త పరిచయాలు.. పాత స్నేహితులతో మీటింగులు, చాటింగులు.. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. కాలేజిలో మేము సీనియర్స్ అయిపోయాం.. ఇప్పుడే మొదలైంది నా జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్...

మా జూనియర్‌గా ఓ అమ్మాయి చేరింది. "లవ్ ఎట్ ఫస్ట్ సైట్" అంటారు కదా... నా విషయంలోనూ అదే జరిగింది. తనని చూడగానే పడిపోయాను.. కింద కాదు లెండి ప్రేమలో.... ఇంకేముంది. తనని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని ఓ తెగ ప్లాన్లు వేసేవాడిని.. ముందు తన స్నేహితుల ద్వారా ఆమె వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నా..

కానీ.. తర్వాత షాక్ అయ్యా.. తనకి ప్రేమ దోమ అంటే ఇష్టం లేదని తెలుసుకొని.. అయితే నాలో పట్టుదల ఇంకా పెరిగింది. తనకు ఓ మంచి ఫ్రెండ్‌గా పరిచయం అయ్యాను. ఒక రోజు ఓ కవితను రాసి(అప్పట్లో మనకి కొంచెం కళాపోషణ ఉండేదిలే.. ఫ్రెండ్స్‌కి ప్రేమ లేఖలు రాసిచ్చే వాడిని) తన కూర్చునే బెంచిలో ఉంచాను..

తర్వాత రోజు సమాధానం వచ్చింది. ఆ పేపర్‌పై 100/100 అని వేసి ఇలా రాసి ఉంది. "ఎవరైనా చూస్తే అనుమానిస్తారు. ఇలా లెటర్ పెట్టకు ప్లీజ్" అని. హమ్.... అప్పుడు నేను "ఎవరో ఏదో అనుకుంటారని, మన వ్యక్తిత్వాన్ని, అభిరుచులను మార్చుకుంటే.. మన గుర్తింపు ఏముంటుందని" రాసి పెట్టా...

ఇంకేముంది. మళ్లీ రిప్లై వచ్చింది. ఈ సారి పెట్టకు అని మాత్రం కాదు.. "అవును మీరు చెప్పింది నిజమే" అని. అదేంటి అంటారా.. అంతేగా మరి ప్రతి మనిషికి ఎక్కడో కొంచెం "సెల్ఫ్ ఈగో" ఉంటుంది కదా.. దాన్ని రెచ్చగొట్టే సరికి మళ్లీ సమాధానం వచ్చింది.

అలా సంవత్సరం పాటు లేఖల ద్వారా మా పరిచయం సాగింది. ఇంతకీ విషయం చెప్పలేదు కదూ.. ఆ లెటర్లు పెట్టేది నేనే అన్న సంగతి తనకు తెలియదు. అదే ఇక్కడ ట్విస్ట్.. కానీ నేను ప్రతి రోజు తనని కలిసి మాట్లాడుతూనే ఉంటాను.

తనకి ఏదో ఓ మూల నాపై అనుమానం ఉన్నప్పటికీ మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఆ టాపిక్ వచ్చేది కాదు. కాలేజికి సమ్మర్ హాలీడేస్ ఇచ్చేశారు. అయినా ఏదో ఒక సందర్భంలో తనని తరచూ కలుస్తూనే ఉండే వాడిని ఫ్రెండ్ లాగా..

ఇంక నాకు ఫైనల్ ఇయర్.. ఈ విషయంపై కొంచెం దృష్టి తగ్గించి కెరీర్ ప్లానింగ్ వైపు దృష్టి పెట్టాను. ఈ ఇయర్‌లో లెటర్స్ కొంచెం తక్కవే.. కాకపోతే అప్పట్లో కొత్తగా మొబైల్ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి అప్పుడప్పుడు ఫొన్‌లో మాట్లాడుకునే వాళ్లం.

కానీ.. ఈ రెండేళ్ల సమయంలో ఎప్పుడు తను నాకు, నేను తనకి ప్రేమిస్తున్నట్లు తెలుపుకోలేదు. చూస్తుండగానే రెండవ సంవత్సరం కూడా గడిచిపోయింది. జీవితంలో ప్రతి ఒక్కరికి బాధాకరమైన రోజు ఏదని అడగగానే టక్కున చెప్పేది "ఫేర్‌వెల్ డే". అది రానే వచ్చేసింది.

ఇంకేముంది విడిపోతున్నాం.. ఓ వైపు స్నేహితులు విడిపోతున్నారన్న బాధ, మరోవైపు తను, ఇంకోవైపు కాలేజి డేస్ అయిపోయాయి. అయితే.. నా ఫ్రెండ్స్ ఏంచేశారో తెలుసా.. నా రూమ్ నుంచి నాకు తెలియకుండా నేను రాసుకున్న డైరీని ఆ అమ్మాయికి ఇచ్చేశారు.

ఇంకేముంది... తనకి తెలిసిపోయింది నేనే ఆ "ఆకాశరామన్న" అని ఆ రోజు తన కళ్లలో తెలిసింది. తను నన్ను ఇష్టపడుతుందని.. ఆ కళ్లని చూసి ఈ బాధ మొత్తం మర్చిపోయా.. నా మనస్సు సంతోషంతో నిండిపోయింది. కానీ.. కొద్దిసేపే..

లేదు.. చందు ప్రస్తుతం నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు... (అంతా అబద్దం అని నాకు తెలుసు), అని చెప్పింది. నేను సరే అన్నాను. కొంచెం బాధ కలిగింది. నా ప్రేమ నిజమైనదే అయితే భగవంతుడే నిలబెడతాడు అనుకొని నా కెరీర్ చూసుకొని జాబ్ కోసం సిటీ వెళ్లిపోయాను.

అలా కొద్ది నెలలు గడిచిపోయాయి. ఈ సమయంలో మా మధ్య ఎటువంటి కాంటాక్ట్ లేదు. కొద్ది రోజుల తర్వాత తను నా ప్రెండ్స్ ద్వారా నా ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి "చందూ.. నువ్వు నా పక్కన ఉన్నన్ని రోజులు నీ విలువ తెలియలేదు. ఇప్పుడు తెలుస్తోంది. నవ్వు నాకు కావాలి రా.." అని చెప్పింది.

అంతే.. వెంటనే సిటీ నుంచి మా ఊరు వచ్చి తనతో మాట్లాడా.. తన కెరీర్ కూడా సెట్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అని చెప్పా.. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. తర్వాత మా పెళ్లికి ఇరు కుటుంబాలను ఒప్పించాం. ప్రస్తుతం మూడు నవ్వుల ఆరు ఆనందాలుగా సాగిపోతోంది మా జీవన ప్రయాణం.

వెబ్దునియా పై చదవండి