ఆగివున్న లారీని ఓ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. వీరంతా విందులో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. వికారాబాద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన విందు కార్యక్రమానికి హాజరయ్యారు. విందు ముగించుకుని తిరిగి తమ గ్రామానికి పయనమయ్యారు. ఈ క్రమంలో, వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై అప్పటికే నిలిపి ఉంచిన ఒక లారీని వీరు ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్ను మూశారు. ప్రమాదంలో 20 మందికిపైగా గాయపడగా వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన వారు విందు నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనతో చెన్వెళ్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.