తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

ఠాగూర్

మంగళవారం, 20 మే 2025 (09:34 IST)
తెలంగాణ రాష్ట్ర రాజ్‌భవన్‌లో కంప్యూటర్ హార్డ్ డిస్క్ చోరీ జరిగింది. సుధర్మ భవన్‌ నుంచి నాలుగు హార్డ్ డిస్క్‌లు కనిపించకుండాపోయాయి. ఈచోరీ ఈ నెల 13వ తేదీన జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీనిపై రాజ్‌భవన్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఓ టెక్కీని అరెస్టు చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని అత్యున్నత అధికార కేంద్రాల్లో రాజభవన్ ఒకటి. ఇక్కడ చోరీ జరగడం కలకలం రేపింది. పంజాగుట్ట పరిధిలోని రాజభవన్ ప్రాంగణంలో ఉన్న సుధర్మ భవన్‌లో నాలుగు కీలకమైన కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు చోరీకి గురైనట్టు అధికారులు గుర్తించారు. ఈ నెల 13న ఈ ఘటన జరిగింది. రాజభవన్‌లోని సుధర్మ భవన్‌లో కొన్ని కంప్యూటర్ల నుంచి నాలుగు హార్డ్ డిస్క్‌లు కనిపించకుండా పోయిన విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీనిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అయితే, నిరంతరం డేగ కళ్లతో కూడిన పహారా ఉండే రాజభవన్ వంటి ప్రదేశంలో ఈ తరహా ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదు అందుకున్న పంజాగుట్ట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఈ చోరీకి పాల్పడింది రాజభవన్‌లోనే కంప్యూటర్ హార్డ‌వేర్‌ ఇంజినీర్ పనిచేస్తున్న శ్రీనివాస్ అని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. ఆ తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు