కామన్వెల్త్ క్రీడల థీమ్ సాంగ్‌ను ఆవిష్కరణ!

కామన్వెల్త్ క్రీడల కోసం ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్.రెహ్మాన్ ప్రత్యేకంగా రూపొందించిన థీమ్ సాంగ్‌ను శనివారం రాత్రి న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్వర మాంత్రికుడు స్వయంగా ఆవిష్కరించారు. కళ్లు చెదిరే రీతిలో శనివారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆస్కార్ విజేత "ఓ యారో, యే ఇండియా బులాలియా" అంటూ ఆలపిస్తూ.. సభికులను మంత్రముగ్ధులను చేశారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఈ గీతాన్ని ఆలపించిన రెహ్మాన్ తన గాన మాధుర్యంతో ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు.

కన్నులపండువగా సాగిన ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, కామన్వెల్త్ నిర్వాహక కమిటీ ఛైర్మన్ సురేశ్ కల్మాడీలు హాజరయ్యారు. కామన్వెల్త్ థీమ్‌ సాంగ్‌ను స్వరపరిచే అవకాశం లభించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నట్టు రెహ్మాన్ ప్రకటించారు. ఈ గీతానికి స్వరాలు కూర్చడం అంత సులభమైన విషయం కాదని, ఆర్నెల్ల క్రితం మొదలుపెడితే శుక్రవారానికి పూర్తయిందన్నారు.

ఇక దాదాపు గంటసేపు సాగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ శ్యామక్ దావర్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్యరూపకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. థీమ్‌సాంగ్ చేయడానికి రెహమాన్ ఒప్పుకోవడంతో తమకు ఎంతగానో ఆనందం కలిగించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చెప్పారు. ఈ క్రీడలను విజయవంతం చేసేందు కృషి చేస్తామన్నారు.

వెబ్దునియా పై చదవండి