దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్: గాయంతో గంభీర్ దూరం!

శుక్రవారం, 7 జనవరి 2011 (09:26 IST)
భారత యువ జట్టును తన కెప్టెన్సీ సారథ్యంలో సమర్థవంతంగా నడిపించి న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకునేలా చేసిన భారత ఓపెనర్ గౌతం గంభీర్, దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో గంభీర్ ఆడబోడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో 93 పరుగులు సాధించిన గౌతం గంభీర్‌ సెంచరీని చేజార్చుకున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌‌లో గంభీర్ వ్యక్తిగత స్కోరు 93 పరుగుల వద్ద ఆతని ఎడమ చేతికి గాయం తగిలింది. ఈ గాయంతో గంభీర్ ఫీల్డింగ్‌కు కూడా దిగలేదు.

కానీ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన గంభీర్, వన్డే సిరీస్‌కు దూరమవుతాడని బీసీసీఐ తెలిపింది. గాయం కారణంగా గంభీర్‌కు విశ్రాంతి ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించింది.

ఇప్పటికే దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా గాయంతో తప్పుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లోనూ టీమిండియాకు సఫారీల నుంచి గట్టిపోటీ తప్పదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి