ఏ ఆధారాలతో రేవంత్‌ను అరెస్టు చేశారు : హైకోర్టు ప్రశ్న :: ఫైర్‌బ్రాండ్ రిలీజ్‌కు ఈసీ ఆదేశం

మంగళవారం, 4 డిశెంబరు 2018 (15:42 IST)
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారనీ, ఎలాంటి ఆధారలతో అదుపులోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే, రేవంత్ అరెస్టుకు సంబంధించిన నివేదికను తక్షణం కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 
 
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ప్రజా కూటమి అభ్యర్థి రేవంత్‌ రెడ్డిని మంగళవారం మూడు గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి... తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ కోరారు. 
 
దీంతో విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఏ ఆధారాలతో రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారంటూ నిలదీసింది. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా రేవంత్‌ రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారని, శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను అదుపులోకి తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. బంద్‌కు రేవంత్‌ పిలుపునిస్తే తప్పేంటని.. ఆయనను అదుపులోకి తీసుకొని ఏ నేరాన్నినియంత్రించారని పోలీసులను ప్రశ్నించింది. 
 
నిఘావర్గాల సమాచారం మేరకే తాము రేవంత్‌ రెడ్డిని ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలపగా.. ఆధారాలు సమర్పించాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచి, రేవంత్ అరెస్టుకు కారణాలపై ఆధారలను ఈ రోజే కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 
 
మరోవైపు, రేవంత్ రెడ్డిని తక్షణం విడుదల చేయాల్సిందిగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఆదేశించారు. మొత్తంమీద రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంతో తెలంగాణ ఎన్నికల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్‌లు రేవంత్ రెడ్డి అరెస్టుపై ఈసీకి ఫిర్యాదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు