ఒకే రోజు 32 ప్రసవాలు... వీటిలో 17 సాధారణ కాన్పులు..
సోమవారం, 21 ఆగస్టు 2023 (11:30 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో శనివారం 32 ప్రసవాలు జరిగాయి. వీటిలో 17 సాధారణ కాన్పులు కాగా.. 15 సిజేరియన్లు ఉన్నాయి. 13 మందికి తొలి కాన్పులు జరగగా వీరిలో 9 మందికి సాధారణ ప్రసవాలు అయ్యాయి. తాజా ప్రసవాల్లో 20 మంది మగ, 12 మంది ఆడ శిశువులు జన్మించారు.
వనపర్తిలో మూడు నెలల క్రితం 29 ప్రసవాలు జరగగా.. ఆ రికార్డును ఇప్పుడు అధిగమించినట్లు గైనకాలజిస్టు విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్ అరుణకుమారి, ప్రొఫెసర్ కిరణ్మయి, అసోసియేట్ ప్రొఫెసర్ జరుహా, వైద్యులు అరుణజ్యోతి, కరుణప్రియ, సోని ఆదివారం తెలిపారు. వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు నరేందర్‌కుమార్ అభినందించారు. తల్లులు, బిడ్డలంతా ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు.
జబర్దస్త్ నటుడి సందీప్‌పై కేసు నమోదు.. ఎందుకు తెలుసా?
ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్‌లో నటించే హాస్య నటుడు, గాయకుడు సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ సందీప్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. గత 2018లో సందీప్‌కు ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ విషయం తెలియడంతో యువతిని ఆమె తల్లిదండ్రులు దూరం పెట్టారు. కానీ, సందీప్ ఇచ్చిన భరోసాతో యువతి తల్లిదండ్రులను వదిలి బయటకు వచ్చేసి, షేక్‌పేటలోని ఆల్‌హమారా కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటుంది.
ఈ క్రమంలో ఆమెను పలుమార్లు వశపరుచుకున్న సందీప్.. పెళ్లి విషయాన్ని మాత్రం దాటవేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి తొలుత గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని చెప్పి, జీరో ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసి మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో మధురానగర్ పోలీసులు కేసును విచారిస్తున్నారు.
పని ఒత్తిడి భరించలేక బ్యాంకు మేనేజరు బలవన్మరణం.. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని కొమ్రం భీం జిల్లా వాకిండిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడి భరించలేక ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన భార్య, కుమారుడు అనాథలయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జిల్లాలోని వాంకిడి మండలంలోని ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో విధులు నిర్వర్తిస్తున్న బానోతు సురేష్(35) ఈ నెల 17న విధులు పూర్తయ్యాక.. రాత్రి 7.30 గంటల సమయంలో కార్యాలయంలోనే ముందుగా తెచ్చుకున్న పురుగుమందు తాగారు. అనంతరం వాంతులు చేసుకున్నారు.
దీన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది ఏమైందని అడిగితే ఒంట్లో బాగాలేదని సమాధానమిచ్చారు. సిబ్బంది వెంటనే ఆసిఫాబాద్‌లో ఉంటున్న భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
దీంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలకు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందారు. బ్యాంకులో పనిభారం ఎక్కువైందని భార్య ప్రియాంకతో చెబుతుండే వాడని, ఒత్తిడితోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తండ్రి లక్ష్మీరాజం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.