స్పీడ్‌గా వెళ్తున్న రైలు పక్కన నిల్చుని ఇన్‌స్టాగ్రామ్ రీల్ షూట్ చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఇన్ స్టా రీల్స్, సెల్ఫీలు, షార్ట్స్ వీడియోల కోసం యువత ఎలాంటి సాహసానికైనా సిద్ధంగా వుంది. ఇలా ఇన్ స్టా రీల్ కోసం రైలు ముందు నిల్చున్న యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. సనత్ నగర్‌లో రైలు పట్టాలపై 9వ తరగతి చదువుతున్న మహ్మద్ సర్ఫరాజ్ (16) ఇన్ స్టా రీల్ కోసం వేగంగా వెళ్తున్న రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. అతను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం వీడియోను చిత్రీకరిస్తున్నాడు. వస్తున్న రైలు ముందు ట్రాక్‌కి దగ్గరగా సర్ఫరాజ్ నిలబడి ఉన్నాడు.
అయితే వేగంగా వస్తున్న రైలును చూసి భయపడిన సర్ఫరాజ్ స్నేహితులు తమను తాము రక్షించుకునేందుకు దూరంగా వెళ్లగా, సర్ఫరాజ్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది.