కాంగ్రెస్ పార్టీకి శనిపట్టుకోవడం వల్లే రేవంత్ రెడ్డిని ఆ పార్టీలోకి ఆహ్వానించారని తెలుగుదేశం పార్టీ బీ ఫార్మ్పై గెలిచి, టీఆర్ఎస్లోకి ఫిరాయించిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని ఆయన ఐరన్ లెగ్గా అభివర్ణించారు. తెలంగాణలో టీడీపీ నాశనం కావడానికి రేవంత్ రెడ్డినే కారణమన్నారు. టీడీపీలోకి వచ్చిన ఆరేళ్లలోనే పార్టీని భ్రష్టు పట్టించిన ఘనత ఆయనదేనని ఎద్దేవా చేశారు.
తమవంటి నేతలు మూడు దశాబ్దాల పాటు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయగా, రేవంత్ వంటి వ్యక్తులు దాన్ని నిమిషాల్లో సర్వనాశనం చేశారని కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే మాధవరం కృష్ణారావు రేవంత్ రెడ్డి సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని.. లేకుంటే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
కేసీఆర్ పాలన నుంచి తెలంగాణను ఆదుకోవడానికి, ప్రజలకు మేలు చేయడానికి రేవంత్ మద్దతుదారులు, అనుచరులు, కార్యకర్తలు కాంగ్రెస్ లోకి రావాలని సవినయంగా మనవి చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, లోక్ సభలో, రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ చేయించిన గొప్పతనం సోనియాదేనని చెప్పుకొచ్చారు.