తెలంగాణా టీడీపీ బాధ్యతల నుంచి సీనియర్లకి విముక్తి?
బుధవారం, 18 డిశెంబరు 2019 (05:15 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణా మీద కూడా ఎక్కువగానే దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తెలంగాణాలో పార్టీ పరిస్థితి మీద ఆయన ఎప్పటికప్పుడు కార్యకర్తలతో మాట్లాడటం వారి అభిప్రాయాలను తెలుసుకోవడం వంటివి గత కొన్ని రోజులుగా చేస్తున్నారు.
ఇక హైదరాబాద్ లో రెండు రోజులు ఉండటం, ఆ రెండు రోజులు కార్యకర్తలకు అందుబాటులో ఉండటం వంటివి చంద్రబాబు చేస్తున్నారు. ఇదే సమయంలో వ్యక్తిగతంగా కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణా విషయంలో చంద్రబాబు ఏదో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.
ఆ రాష్ట్రంలో నాయకులు పార్టీ మారినా క్యాడర్ మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉంది. అక్కడక్కడా తప్పనిసరి పరిస్థితుల్లో క్యాడర్ కూడా పార్టీ మారినా, వారికి కూడా పార్టీ మీద అభిమానం చెక్కుచెదరలేదు.అక్కడి క్యాడర్ ని కాపాడుకోవడం తో పాటుగా నాయకత్వాన్ని మార్చే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ లో తనతో ఉన్న నేతలకు కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఎవరైతే బాధ్యతల్లో, పదవుల్లో ఉన్నారో వారు యువతని ఉత్తేజపరచటంలో విఫలం అయినట్లు ఆయన భావిస్తున్నారు.
ఆ బాధ్యతల నుంచి వారిని తప్పించి మండలాల వారీగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని, యువతకు ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వాలని భావిస్తున్నారట.
రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి అక్కడ బలం లేకపోయినా సరే క్యాడర్ మాత్రం స్థానిక సమస్యల పై పోరాడుతూనే ఉంది. వారిలో చాలా మంది పార్టీ కోసం నిర్విరామంగా పని చేస్తున్నారు. త్వరలోనే వారికి పదవులను కూడా ప్రకటించి, ఇక సీనియర్లను సలహాదారులుగానే పరిగణించే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. సంక్రాంతి తర్వాత నాయకత్వ ప్రక్షాళన చేసే అవకాశం ఉందని అంటున్నారు.