నాంపల్లి అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అంతకుముందు ఘటనా స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేస్తుందని ఆయన ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని, ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగిన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రంలోగా మృతుల కుటుంబాలకు పీఎం కేర్స్ సాయం అందజేస్తుందని పేర్కొన్నారు. నాంపల్లిలో జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.