ఇటీవల తెరాస నుంచి బీజేపీలో చేరిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ నోరు జారారు. తాను రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే అక్కడ ఎగిరేది గులాబీ జెండానే అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తాను తప్పు మాట్లాడినట్టు తెలుసుకుని, కాషాయం జెండా ఎగురవేస్తామని ప్రకటించారు.
సాధారణంగా దశాబ్దాలుగా ఉన్న పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లినపుడు రాజకీయ నేతలు అలవాటులో పొరపాటుగా నోరు జారడం, ఆపై నాలుక కరుచుకోవడం సహజమే. అలాగే, ఈటల రాజేందర్ కూడా తాజాగా పొరబడ్డారు.
తన మాతృపార్టీ తెరాసను వీడి ఆయన బీజేపీలో చేరారు. ఇది సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. హుజురాబాద్‌లో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు.