శుక్రవారం నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు

గురువారం, 23 సెప్టెంబరు 2021 (11:00 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ, మండలి సమావేశాల్లో చర్చించే అంశాలు, పనిదినాలపై రేపు స్పష్టత రానుంది. దళితబంధు పథకం అమలు సహా పంటలసాగు, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, ఉద్యోగాల నియామకం, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు సహా ఇతర అంశాలు ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. 
 
ఈ సమావేశాల్లో మొత్తం 8 బిల్లులను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటల నుంచి ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాల అజెండా, పనిదినాలు రేపు ఖరారు కానున్నాయి. ఇందుకోసం అసెంబ్లీ, మండలి సభా వ్యవహారాల సలహా సంఘాలు- బీఏసీ భేటీ అవుతాయి. సమావేశాలు నిర్వహించే పనిదినాలు, చర్చించాల్సిన అంశాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను ఈ భేటీలో ఖరారు చేస్తారు. 
 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంపై సమావేశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. యాదాద్రి జిల్లా వాసాలమర్రి, హజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు మరో 4 నియోజకవర్గాల్లో ఒక్కో మండలం చొప్పున పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు.. ఇతర వర్గాలకు ఈ తరహా పథకం తేవాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో దళితబంధుపై శాసనసభ సమావేశాల్లో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ఆంధ్రప్రదేశ్​తో జలవివాదాలు, కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సహా ఇతర అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశాలు ప్రస్తావన కొచ్చే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు