తెలంగాణాలో సీఎం కేసీయార్ ది దద్దమ్మ ప్రభుత్వమని వై.ఎస్.ఆర్.టి.పి అధికార ప్రతినిధి కొండ రాఘవ రెడ్డి విమర్శించారు. తమ పార్టీ అధినేత్రి వై.ఎస్. షర్మిల నిరాహార దీక్ష భగ్నం చేయడంతోనే, కేసీఆర్ కి మేము అంటే ఏంటో అర్ధం అవుతుందన్నారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ప్రజల పక్షాన పోరాటం చేయడం, దీక్షలు చేయడం కొత్త ఏమీకాదన్నారు.
గత 8 నెలలో షర్మిల చేయని దీక్ష లేదు, అందరి తరపున పోరాటం చేయడానికి ముందు ఉండే వ్యక్తి మా షర్మిల. కేసీఆర్ ప్రభుత్వం ఎవరనీ వదలకుండా, రైతులు, విద్యార్థులు, కార్మికులు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి తీసుకువచ్చారని విమర్శించారు. ఇది బంగారు తెలంగాణ కాదు, ముమ్మాటికీ ఆత్మహత్యల తెలంగాణ అని కొండ రాఘవ రెడ్డి విమర్శించారు.
వినాయక చవితి రోజు చైత్ర వంటి బంగారు పాపపై అఘాయిత్యం జరిగితే కనీసం కేసీఆర్ ప్రభుత్వానికి చలనం కూడా లేదని, తమ పార్టీ అధినేత్రి నిన్న పాప ఇంటికి ఓదార్పుకి వెళ్లి, అక్కడ వాతావరణం చూసి మనసు చలించిందని, అందుకే అక్కడకి అక్కడే నిరాహార దీక్షకు దిగారని చెప్పారు.
ఒక పద్ధతి లేకుండా, దీక్ష విరమణ చేయాలంటూ మా పైన వత్తిడి తెచ్చారు. టెర్రరిస్ట్ పైన దాడి చేసినట్లు మా అధినేత్రి పై దాడి చేశారు. మా కార్యకర్తలను పోలీసులు వారు పిడి గుద్దులు గుద్దారు. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తూ మాకుమాడి దాడి చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు కేసీఆర్ కి బానిసలుగా మారారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు.
పాప చనిపోయి వారం అయినా పోలీస్ లు చేతగాని దద్దమ్మల్లా తయారయ్యారని, పట్టుకుంటే 10 లక్షలు ప్రకటన చేయడం పోలీస్ వారి చేతగాని తనానికి నిదర్శనమని చెప్పారు. పాప కుటుంబానికి ముష్టి 20 లక్షలు ఇస్తా అని ప్రకటన చేయడం కేసీఆర్ ప్రభుత్వంకి అలవాటు అయిందని, తమ పార్టీ తరవున కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పాప కుటుంబానికి ఆర్ధిక సహాయంతో పాటు, వారి కుటుంబానికి పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.