తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా, గత రెండుమూడు రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉన్న సమయంలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమికి అవసరమని ఆయన నొక్కివక్కాణిస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు జాతీయ స్థాయిలో సంపూర్ణ మద్దతు లభిస్తోంది. పలు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు అండగా నిలుస్తున్నారు. ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. అదేసమయంలో కేసీఆర్ వ్యాఖ్యలు బీజేపీ పాలకుల గుండెల్లో గునపాల్లా గుచ్చుకుంటున్నాయి. ఫలితంగా కేసీఆర్‌పై కమలనాథులు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజల దీవెనలు, మద్దతునిస్తే దేశానికి నాయకత్వం వహించి, భారత్ దశ మారుస్తానంటూ ప్రకటించారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ, "10 లక్షల కిలోమీటర్ల ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. తెలంగాణ కోసం బయల్దేరిననాడు నేను ఒక్కడినే ఉన్నా. నన్ను పెంచి, పోషించి, పెద్ద చేసింది మీరే. ప్రజలే నాకు అన్నదమ్ములు, తల్లిదండ్రులు. మీ దీవెన ఉంటే, వంద శాతం భారత రాజకీయాలకు దశ దిశ చూపించి, దేశ ప్రజలకు అద్భుతమైన మార్గదర్శనం చేస్తా. తెలంగాణలో మొదలైన ఈ ప్రస్థానం దేశమంతా చుట్టుముడుతుంది. మీ అందరి ఆశీస్సులూ కేసీఆర్‌కి ఉంటాయి. వంద శాతం విజయం సాధిస్తాడు" అని ప్రకటించారు.
"ఇప్పటికైనా రెండు జాతీయ పార్టీలు వాళ్ల పద్ధతి, పంథా, ఆలోచన సరళి మార్చుకోవాలి. చైనాలో అలా జరుగుతోంది. అది మన దేశంలో జరగడం లేదు. మార్చండి మన రాజ్యాంగాన్ని.! రాజ్యాంగంలో సవరణలు తీసుకురండి. అందుకు దేశ ప్రజలు మీవెంటే ఉంటారు. ఎందుకు చేయరు? కథలు చెప్తే, ఉపన్యాసాలిస్తే పేదరికం పోదు. ప్రాక్టికల్‌గా, రాడికల్‌గా, ఔటాఫ్ బాక్స్ పోయి చైనా.. ఏమీలేని సింగపూర్.. బాంబు దాడి తర్వాత జపాన్ ఏవిధంగా ఒళ్లు వంచి పనిచేశాయి!? మన దేశం కూడా అలాగే పైకి రావాలి. సంకల్పం, చిత్తశుద్ధి, ధైర్యం, నిజాయితీ ఉంటే 100 శాతం ఆ పరిస్థితి వస్తది. వచ్చి తీరుతది. నాకు ఎలాంటి అనుమానం లేదు'' అని కేసీఆర్ ఉద్వేగంగా అన్నారు.