తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు ... ఇదే కేసీఆర్ ఎత్తుగడ : రేవంత్ రెడ్డి

సోమవారం, 9 ఆగస్టు 2021 (16:53 IST)
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మరోమారు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళతారని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఇదే అంశంపై రేవంత్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ, కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని.. ఈ మేరకు 2022 డిసెంబరులో ప్రభుత్వాన్ని రద్దు చేసి 2023 మొదట్లో ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. ఈ మేరకు తమవద్ద పక్కా సమాచారం ఉందన్నారు. 
 
అందుకే గతంలో తమకు ఎదురైన ఘటనలను దృష్టిలో ఉంచుకుని అలా కాకుండా ఈసారి చర్యలు తీసుకుంటున్నట్లు రేవంత్ వివరించారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొందరు ముందస్తు ఎన్నికలు రావని అంటున్నారని.. ఈ మాట 100కి 100 శాతం కరెక్ట్ కాదన్నారు. 
 
గతంలో తాను ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పానని.. తాను చెప్పినట్లే ముందస్తు ఎన్నికలు వచ్చాయని గుర్తుచేశారు. అంతేకాకుండా తాను ఈటెల రాజేందర్‌ను పార్టీ నుంచి గెంటేస్తారని చెప్పానని.. అది కూడా జరిగిందని రేవంత్ అంటున్నారు.
 
అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ను కేసీఆర్ సీఎం చేస్తారని అందరూ భావించినా.. తాను ఆ అవకాశం లేదని కూడా చెప్పానని రేవంత్ గుర్తుచేశారు. దీనికి కారణం పరిస్థితులు అనుకూలించక పోవడమేనని చెప్పారు. 
 
ఇదిలావుంటే, తన ప్రత్యర్థుల అంచనాలను చిత్తు చేయడంలో కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే 2019లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల కోసం 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రత్యర్థులను చిత్తుగా ఓడించారు. ఇలా ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ప్రతిపక్షాలకు పాలుపోలేదు. తక్కువ సమయంలో వారి వ్యూహాలు పారలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు