తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరుగా మండిపడుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన ఆమె కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఓ నివేదిక సమర్పించినట్టు సమాచారం. పైగా, ప్రభుత్వ ఉన్నతాధికారులైన సీఎస్, డీజీపీల తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పనిలోపనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు. గవర్నర్‌తో తమకెలాంటి పేచీ లేదని స్పష్టం చేశారు. అయితే మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. గవర్నర్ నోరు పారేసుకోవడం మానుకోవాలంటూ హితవు పలికారు. తమిళిసై వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారంటూ ఘాటైన విమర్శలు చేసారు. ప్రభుత్వం ఎక్కడ అవమానించిందో గవర్నర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.