వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన అనేక మంది నేతల విజ్ఞప్తి మేరకు ఈ జిల్లా పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చారు. ఇకపై వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండగా మార్చారు. జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞప్తుల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా మార్చుతామని సీఎం కేసీఆర్ సోమవారం జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించారు.
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం ప్రారంభించిన కలెక్టరేట్ భవనాన్ని హన్మకొండ జిల్లాగా పరిగణించాలి. దీనికి సమీపంలో నిర్మించబోయే కలెక్టరేట్‌ను వరంగల్ కలెక్టరేట్‌గా పరిగణించాలి. పేరు మార్పునకు సంబంధించిన ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లోనే వస్తాయని సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అధునాతన జిల్లా కలెక్టరేట్ భనవాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. వరంగల్ నాయకులు, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరిపాలన సంస్కరణలు బాగా తెచ్చుకున్నాం. అవన్నీ పరిపుష్టం కావాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం అంటే ప్రజలకు ఇబ్బంది కలగనప్పుడే నిజమైన పరిపాలన అని అన్నారు. పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందన్నారు.