బాహుబలి సినిమా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి-ది కంక్లూజన్ సినిమా కూడా ప్రీ- రిలీజ్‌లోనే భారీ హైప్‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు నటించారు. ఈ సినిమా కోసం నటులందరూ తీవ్రంగా శ్రమించారు.
బాహుబలి -1 చిత్ర నిర్మాణం సమయంలోనే బాహుబలి-2కు సంబంధించిన చాలా సన్నివేశాలను చిత్రీకరించారు. రెండేళ్ల క్రితం అనుష్క స్లిమ్‌గా ఉన్నది. కానీ స్వీటీ సైజ్ జీరో కోసం ఒళ్లు పెంచేసింది. బొద్దుగా తయారైంది. దీంతో, అప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలకు, ఇప్పుడు తీసిన సన్నివేశాలకు చాలా తేడా వచ్చింది.
కొన్ని సీన్లలో సన్నగా... కొన్ని సీన్లలో లావుగా అనుష్క కనపడటంతో... ఆమెకు సంబంధించిన మొత్తం భాగాన్ని రీషూట్ చేయాల్సి వచ్చిందట. దీంతో, నిర్మాతలకు అదనంగా రూ. 20 కోట్లు ఖర్చయిందని సమాచారం. అనుష్క బాహుబలిలో కీలక రోల్ కావడంతో నిర్మాతలు ఆమె కోసం భారీగా ఖర్చు పెట్టేందుకు సైతం వెనుకాడలేదని తెలిసింది. జక్కన్న మాత్రం అనుష్కను అందంగాను.. నాజూగ్గా కనిపించేలా చేసేందుకు మల్లగుల్లాలు పడ్డారని సమాచారం.