బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్ర "ప్యాడ్ మ్యాన్". మహిళల రుతుక్రమంపై చర్చిస్తూ, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన పెంచుతూ ఈ చిత్ర కథ సాగుతోంది. ఈ చిత్రం ఓ వైపు బాక్సాఫీసు వద్ద దూసుకెళుతుండగా, అసలు ఈ చిత్రాన్ని చూసేందుకు కూడా పాకిస్థాన్ సెన్సార్ బోర్టు సభ్యులు నిరాకరించారు.
ఈ చిత్రం తమ ఆచారాలు, సంప్రదాయాలను నాశనం చేసేలా ఉందని సెన్సార్ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై ప్యాడ్ మ్యాన్ చిత్ర దర్శకుడు ఆర్ బాల్కీ ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి తీసిన సినిమా సంప్రదాయాలకు విరుద్ధమని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.
ఈ చిత్రాన్ని పాక్‌లో ప్రదర్శనకు అనుమతించాలని కోరారు. ఆసియాలో నెలసరి సమస్యలతో మరణించిన వారు ఎందరో ఉన్నారని, ఇక్కడి మహిళలకు ఈ చిత్రం అవసరమన్నారు. అయితే, పాక్ సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని చూసి సర్టిఫికేట్ ఇచ్చేందుకు ససేమిరా అనడంతో ఈ చిత్రం పొరుగు దేశంలో విడుదలకు నోచుకోలేదు.