ప్రేమకథలు కొత్తేమీకాదు. గ్రామీణ ప్రేమకథలు అంటే పల్లెవాతావరణం, పంటపొలాలతో ప్రకృతి అందం, అక్కడి మనుషులు మనస్తత్వాలు, చమత్కారాలు, మాటలు ఇవన్నీ అవో కొత్త లోకానికి తీసుకెళతాయి. అలాంటి ప్రేమకథలో దేవరకొండలో విజయ్ ప్రేమకథ ఒకటి. మరి ఈరోజే విడుదలయిన ఈ సినిమాలో దర్శకుడు ఏం చెప్పాడో చూద్దాం.
కథః
దేవరకొండ అనే ఊరు. ఊరికి పెద్దదిక్కు సీతారామయ్య (నాగినీడు). ఊరివారంతా బాగుండాలనే తత్త్వం ఆయనది. కుమార్తె దేవకి (మౌర్యాని) పక్క ఊరు కాలేజీలో చదువుతుంది. అదే ఊరిలో ఆటో నడుపుకునే విజయ్ చిన్నతనం నుంచి దేవకి అంటే ఇష్టం. మౌర్యానికూడా విజయ్‌ను ప్రేమిస్తుంది. అంతరాల తేడాతో సీతారామయ్య ససేమిరా అనడంతో విజయ్ తన భర్త అని నలుగురిముందు తెగేసి చెప్పేస్తుంది. దాంతో అహం దెబ్బతిన్న సీతారామయ్య ఇద్దరినీ ఊరునుంచి వెలేస్తాడు. ఆ సమయంలో మౌర్యాని బాబాయ్ వారిని ఓ పాడుపడిన బావి దగ్గర ఇంటిలో వుండేలా చేస్తాడు. ఆ తర్వాత వారి జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవి ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
ప్రేమకథలు ఎవరికైనా ఒకసారి తరచి చూసుకునేవిధంగానే వుంటాయి. అందుకే తమ కళ్ళముందు పెరిగిన అమ్మాయిలోని నిజమైన ప్రేమకోసం ఊరంతా కదలిరావడం ముగింపులో చక్కగా ఆవిష్కరించాడు. మనిషిలో పట్టింపులు, పంతాలు, పరువు అనేవి పిల్లల జీవితాలకు, ప్రేమించిన వారి జీవితాలకు శాపం కాకూడదు అనే మంచి విషయాన్ని దర్శకుడు సినిమాలో చెప్పాడు. మొత్తంగా సందేశం, వినోదం కలిపిన ఓ చక్కటి ప్రేమ కథను ప్రేక్షకులు ఈ చిత్రంతో ఆస్వాదించవచ్చు.
చక్కని పైర్లు, పొలాలు చూస్తే మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. ఈ సినిమాలో సినిమాటోగ్రపీ హైలైట్ అని చెప్పవచ్చు. ఇందులోని పాత్రలు సహజంగా అనిపిస్తాయి. కానీ సరికొత్తగా చూపించే విధానం కొంత లోపం కనిపించింది. కథకు సరిపడా నటీనటులున్నా వారిని ఇంకా బాగా ఉపయోగించాల్సింది. కొన్ని సన్నివేశాలు హృదయాన్ని కదిలిస్తాయి. మరికొన్ని ఫీల్ కలిగించవు. అయినా తడబాటు లేకుండా దర్శకుడు కథనం బాగానే నడిపాడు. పతాకసన్నివేశం ఆకట్టుకుంటుంది. హీరోగా విజయ్‌శంకర్ కొత్తవాడైనా లవ్‌స్టోరీకి సరిపోతాడు. మౌర్యాని సహజంగానే నటించింది. మిగిలిన పాత్రలన్నీ లోకల్ నటీనటుల్ని పెట్టారు. ఎటువంటి అసభ్యతలేకుండా సినిమా తీశాడు. ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.