తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆధ్వర్యంలో మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో హీరోలు చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. అయితే, ఇందులో హీరో రాజశేఖర్ తీవ్ర ఆగ్రహంతో చిరంజీవిని టార్గెట్ చేశారు. ముఖ్యంగా, మూవీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, సఖ్యత లేని విషయం బహిర్గతమైంది.
ఈ సమావేశంలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. చిరంజీవి మైక్ అందుకుని 'మా'లో ఏవైనా సమస్యలు ఉంటే మనలో మనమే చర్చించుకుందాం, మంచి ఉంటే అందరికీ వినిపించేలా చెబుదాం.. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం అంటూ పిలుపునిచ్చారు.
ఆపై తాను మాట్లాడుతూ, "కలిసి ఉందాం, కలిసి సాగుదాం అంటూ చిరంజీవిగారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఏవేవో చెబుతుంటారు కానీ, మాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిప్పులేనిదే పొగరాదు, మనందరం హీరోలుగా యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోలుగా రియల్ లైఫ్లో చేస్తుంటే అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు" అంటూ నర్మగ్భ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలకు అక్కడే ఉన్న మోహన్ బాబుకు చిర్రెత్తుకొచ్చింది. రాజశేఖర్ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పే ప్రయత్నం చేయగా, "వినండి మోహన్ బాబు గారూ, మీరు అరిచేస్తే ఇది జరిగిపోదు" అంటూ మరింత మొండిగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా రాజశేఖర్ దూకుడుగానే మాట్లాడారు.
దాంతో చిరంజీవి మైక్ తీసుకుని, "నేను చెప్పిందేమిటి, మీరు మాట్లాడుతున్నదేమిటి, నా మాటలకు ఏమైనా విలువ ఇచ్చారా? ఇష్టంలేని వాళ్లు ఇక్కడికి రావడం ఎందుకు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మళ్లీ రాజశేఖర్ జోక్యం చేసుకుని "ఇష్టం ఉంది కాబట్టే వచ్చాం, కాని వచ్చిన తర్వాత ఇలా జరిగింది" అంటూ అక్కడ్నించి నిష్క్రమించే ప్రయత్నం చేశారు.