సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం అనేది కొత్తకాదని, ఎపుడూ జరుగుతూనే ఉంటాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. గత రెండు రోజులుగా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, నవీన్ ఎర్నేనీ, రవిశంకర్, సుకుమార్ తదితర నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇవి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ సోదాలపై దిల్ రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదన్నారు. ఇండస్ట్రీ అంతా జరుగుతున్నాయన్నారు. ఐటీ అధికారులు వాళ్ల విధులు వారు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్న సమయంలో దిల్ రాజు బాల్కనీలోకి రాగా.... ఐటీ దాడులు పూర్తయ్యాయా? అని మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు దిల్ రాజు పైవిధంగా సమాధానమిచ్చారు. కాగా, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ నగరంలోని టాలీవుడ్ నిర్మాతలు, పలు సినీ మీడియా సంస్థలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. బుధవారం కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప-2' మూవీ. గత యేడాది డిసెంబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన రోజు తొలి ఆట నుంచి సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, పాత రికార్డులను తిరగరాస్తూ వస్తుంది. అయితే, ఈ చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిప్రకాష్, సుకుమార్ గృహాల్లో ఐటీ అధికారులు గత రెండు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో "పుష్ప-2" చిత్రం వసూళ్ళకు తగిన విధంగా ఆదాయపు పన్ను చెల్లించలేదని ఐటీ అధికారులు గుర్తించారు. అలాగే, ఈ చిత్రం కోసం ఖర్చు చేసిన బడ్జెట్, వచ్చిన కలెక్షన్లు వంటి అంశాలపై దృష్టిసారించారు.
ఇప్పటివరకు 'పుష్ప-2' మూవీ రూ.1700 కోట్లకుపైగా వసూలు చేసినట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్, వచ్చిన ఆదాయం ఎంతో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సుమారుగా 55 మంది ఐటీ అధికారుల బృందం ఈ తనిఖీల్లో నిమగ్నమైవున్నారు.
కాగా, తొలుత ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన గృహాలు, ఆఫీసుల్లో తనిఖీలకు ప్రారంభించిన ఐటీ అధికారులు గత రెండు రోజులుగా చిత్రపరిశ్రమకు చెందిన నిర్మాతలు, ఫైనాన్షియర్లు, పంపిణీదారుల నివాసాల్లో సోదాలు చేస్తున్న విషయం తెల్సిందే.