నడుంపై గిల్లిన వ్యక్తిని చితక్కొట్టా.. అది చూసి చిరంజీవి, రాఘవేంద్రరావు షాకయ్యారు: శాంతి శ్రీహరి

ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (15:57 IST)
తన నడుంపై గిల్లిన వ్యక్తి చితక్కొట్టాను. అది చూసిన హీరో చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావులు షాకయ్యారని సినీ డ్యాన్సర్ శాంతి శ్రీహరి చెప్పుకొచ్చింది. ఈ సంఘటన 1992లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ 'ఘరానా మొగుడు' షూటింగ్ సమయంలో జరిగిందన్నారు. 
 
ఒక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘వైజాగ్‌లోని హార్బర్‌లో ‘బంగారు కోడి పెట్ట.. వచ్చినండి..’ అనే పాట షూటింగ్ జరుగుతున్న సమయం అది. షాట్ రెడీ అనగానే.. చిరంజీవి రాగానే అక్కడ ఉన్నవాళ్లు చప్పట్లు కొట్టేశారు. నేను ఆరెంజ్ కలర్ స్కర్ట్ వేసుకుని ఉన్నాను. ఆ షాట్ అయిపోగానే పైన ఓ క్లాత్ కప్పుకుని నడిచి వెళుతుంటే.. సుమారు పదిహేను మంది ఉన్న ఓ గుంపు ఒకటి అక్కడికి వచ్చిందన్నారు. 
 
వాళ్లలో ఒకడు నా నడుంపై గిల్లాడు. అంతే, వాడి చెయ్యి పట్టుకుని ముందుకు లాగి చితక్కొట్టుడు కొట్టాను. కింద పడేసి కాళ్లతో తొక్కి పారేశాను. అయితే, చిరంజీవి, రాఘవేంద్రరావు మాత్రం షాకయ్యారు. వెంటనే, వాళ్లు వచ్చి, చెరో వైపు నన్ను పట్టుకుని తీసుకువెళ్లిపోయారు’ అని నాటి సంఘటనను దివంగత నటుడు శ్రీహరి భార్య శాంతి శ్రీహరి గుర్తు చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి