చెర్రీతో గ్యాంగ్ లీడర్ రీమేక్ చేయాలనుంది: చిరంజీవి

సోమవారం, 9 మే 2016 (12:37 IST)
మెగాస్టార్ చిరంజీవికి ఏ రేంజిలో మాస్ ఇమేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయనకి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమా ఆయన కెరీర్‌లో మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది. ఈ సినిమాను రీమేక్‌ చేయాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. 
 
చిరంజీవి నటించిన 149 చిత్రాల్లో గ్యాంగ్ లీడర్‌కి ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన స్థానం వుంది. అలాంటి సినిమా తన కుమారుడు చెర్రీ కెరీర్‌లో ఉంటే బాగుంటుందని చిరు భావిస్తున్నారు. గ్యాంగ్ లీడర్ విడుదలై  సోమవారంతో పాతికేళ్లు పూర్తయ్యాయి. 
 
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. గ్యాంగ్‌లీడర్‌ను చెర్రీతో రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పారు. అయితే చెర్రీకి తగ్గట్టుగా గ్యాంగ్ లీడర్ స్క్రిప్టుని తయారు చేసేది ఎవరో? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. 
 
చెర్రీకి కూడా గ్యాంగ్ లీడర్ సినిమా అంటే ఇష్టం. బ్రూస్ లీలో ఇంచుమించుగా గ్యాంగ్ లీడర్‌లోని చిరు స్టైల్‌నే అనుకరించాడు చెర్రీ. మరి గ్యాంగ్ లీడర్ రీమేక్‌కు తగిన దర్శకుడు ఎప్పుడు దొరుకుతాడో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి