'మెతుకూ మెతుకూ కూడబెట్టి ముద్ద పోగేస్తే దొంగకూడంటున్నారన్నా'.. నోట్ల రద్దుపై పవన్ కళ్యాణ్ ట్వీట్

సోమవారం, 21 నవంబరు 2016 (10:45 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై తొలిసారిగా ట్విట్టర్‌లో స్పందించారు. ప్రజల్లో అశాంతిని పోగొట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. "నోట్లు చెల్లవంటూ ప్రకటన చేసే ముందు తగిన కసరత్తు జరగలేదు. ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. పెద్దనోట్లు చెల్లవు అని చెప్పే ముందు తగిన స్థాయిలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉండింది. ఇప్పటికైనా కొత్త కరెన్సీకి సంబంధించిన వాస్తవాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 
 
గోప్యత ముసుగులో కేంద్రం వాస్తవాలను దాచలేదు. గ్రామీణ ఆర్థిక రంగం, పట్టణాల్లో అసంఘటిత మార్కెట్‌, వృద్ధుల గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి. అదే సమయంలో... 'నోట్ల రద్దుకు సంబంధించి సామాన్యుడి స్పందన' అంటూ తన మిత్రుడు, రచయిత సాయిమాధవ్‌ రాసిన కవితను పవన్‌ ట్వీట్‌ చేశారు. 'మెతుకు మెతుకు కూడబెట్టి ముద్ద పోగేస్తే, దొంగ కూడంటున్నారన్నా! నెనెట్టా బతికేది? కన్నీటి బొట్టు బొట్టు దాపెట్టి ఏడుపు పోగేస్తే.. నా ఏడుపు చెల్లదంటున్నారన్నా.. నేనెట్టా చచ్చేది?’’ అంటూ ఈ కవిత సాగింది. 

వెబ్దునియా పై చదవండి