పుష్ప పాటలు నాకు చాలెంజ్ విసిరాయి- గీత రచయిత చంద్రబోస్
గురువారం, 9 డిశెంబరు 2021 (17:10 IST)
Lyricist Chandrabose
అమెరికా నుంచి కొందరు పరిచయవున్న యువత ఫోన్‌లు చేసి పుష్ప పాటలలోని పల్లవులు, చరణాలు పాడి వినిపిస్తుంటే ఈ కాలం యువత కూడా ఈ పాటల్లోని సాహిత్యాన్ని ఇంతలా ఓన్ చేసుకున్నారా అని చెప్పలేని సంతోషం కలిగింది. నేను గతంలో పనిచేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా నేపథ్యమే చాలా కొత్తది. అందుకే చాలా చర్చోపచర్చలు తప్పలేదు. చివరకు అవుట్‌పుట్ ఎంత బాగా వచ్చిందనేది ముఖ్యం అన్న పాయింట్ మీదే అందరం ఫిక్స్ అయ్యాం. ఇందులోని పుష్పరాజ్ పాత్ర యొక్క కోణంలో.. అతని పార్శ్వంలో.. అతని కవితాత్మక హృదయంతో చెప్పాల్సి రావటం నాకు నిజమైన ఛాలెంజ్ అనిపించింది. అందుకే వెలుగును తింటది ఆకు.. ఆకును తింటది మేక.. మేకను తింటది పులి.. పులిని తింటది చావు పాటలో ఒక ఆహార గొలుసును తీసుకుని, దానికి జీవిత సత్యాన్ని జోడిరచి చెప్పాను. ఈ ఎత్తుగడే చాలా కొత్తగా అనిపిస్తోందని నాతో చాలా మంది అన్నారు. మా ముగ్గురిలో (సుకుమార్, దేవిశ్రీ, చంద్రబోస్) ఒకే సంగీతాత్మ ఉన్నప్పటికీ రంగస్థలం అంత తేలిగ్గా ఈ పాటలు రాలేదని ఖచ్చితంగా చెప్పాలి అని గీత రచయిత చంద్రబోస్ అన్నారు.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ` క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప (ది రైజ్) క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఈ చిత్రంలోని దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దుమ్ము రేపుతున్న ఈ పాటల వెనుక సుకుమార్`చంద్రబోస్`దేవిశ్రీల సూపర్ కాంబో ఉందనేది మనకు తెలిసిందే. పుష్పలోని సాంగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులనీ మెస్మరైజ్ చేస్తున్న సందర్భంగా గీత రచయిత చంద్రబోస్ మీడియా వారితో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..సుకుమార్ గారితో ఆర్య నుంచి నాకు మంచి అనుబంధం ఉంది. మిగిలిన దర్శకులతో పనిచేయడం వేరు.. సుకుమార్ గారితో పనిచేయడం వేరు. ఎందుకంటే సుకుమార్ గారే ఓ సాహిత్య గని. ఆయన్ని సంతృప్తి పరచడం అంత ఈజీ కాదు. మనం ఏం రాయాలి అనే దాని మీద ఆయనకు చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనకు ఒకదాని వెనుక ఒకటి చెపుతూ వెళ్లిపోతుంటారు. చివరగా మనం ఆయన్ను మెప్పించేలా ఏదో ఒకటి చెప్పి ఆయన ప్రవాహాన్ని అడ్డుకోవాలి.
- సుకుమార్ గారి గత చిత్రాల్లో కూడా నేను పాటలు రాసినప్పటికీ.. ఈ సినిమాకు రాయటం చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా స్లాంగ్‌లో నడుస్తుంది. అందుకే పాటల్లో కూడా ఆ ప్రాంత స్లాంగ్‌ను, పదాలను వాడాల్సి వచ్చింది. ముందు ఒకింత ఆలోచనలో పడ్డాను. అయితే సుకుమార్ గారు, అల్లు అర్జున్ చిత్తూరు స్లాంగ్‌ను కష్టపడి ఒంట బట్టించుకుని, అందులో లీనం అయిపోయిన విధానం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. దాంతో నేను కూడా ఆ స్లాంగ్, ఆ ప్రాంత నేటివిటీకి సంబంధించిన పదాలను పట్టుకోవటంలో తీవ్రంగా కృషి చేశాను. దాని ఫలితమే ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న పాటలు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రంలోని పాటలు నా కెరీర్‌కే చాలెంజ్ విసిరాయి.
- ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే రంగస్థలం కోసం నేను పాటలు రాయలేదు. కేవలం ఆ సందర్భాలు మాటలను పలికాయి. అవే పాటలైపోయాయి. నేను వాటిని పేపర్‌పైన పాటల రూపంలో రాసుకోలేదు. లిరికల్ షీట్ విడుదల చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే పేపర్‌మీద పాటల రూపాన్ని పెట్టడం జరిగింది. నా 27 సంవత్సరాల గీత రచయిత జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను.
- సుకుమార్‌గారు, దేవిశ్రీప్రసాద్ గారు, నా కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాల్లానే ఇందులో కూడా ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుంది. ప్రేక్షకుల అంచనాల కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. రంగస్థలం పాటల విషయంలో కూడా నేటివిటీ బేస్ ఎక్కువగానే ఉంటుంది. అయితే అందులోని రాంబాబు.. ఇందులోని పుష్పరాజ్ వ్యక్తిత్వాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యక్తిత్వాలను బలపరుస్తూనే పాటల రచన సాగింది.
- మేం ఆమ్‌స్టర్‌డ్యాం వెళ్లినప్పుడు భోజనాలు చేసి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న ఓ బ్రిడ్జి ఎక్కుతుంటే వచ్చిన ఆలోచనే చూపే బంగారమాయనా పాట. 15 రోజుల మధనం తర్వాత తిరుపతి హోటల్ రూంలో పుట్టింది వెలుగును తింటది ఆకు పాట.. ఇలా ప్రతి పాటకూ ఎంతో మేధోమథనం జరిగింది. మొత్తానికి మా పుష్పలోని పాటలు ప్రేక్షకుల హృదయాలను గంప గుత్తగా దోచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ముగించారు చంద్రబోస్.