రేయింబవుళ్లు కష్టపడుతున్న రజనీకాంత్.. ఎందుకో తెలుసా?

బుధవారం, 23 డిశెంబరు 2020 (10:52 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇపుడు రేయింబవుళ్లు కష్టపడుతున్నారు. ఈ నెలాఖరులో తన రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేయనున్న ఆయన.. ప్రస్తుతం అన్నాత్తై అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కరోనా లాక్డౌన్‌కు ముందే ప్రారంభమైంది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడింది. అయితే, ఇటీవల షూటింగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో తిరిగి షూటింగులు మొదలయ్యాయి. దీంతో రజనీకాంత్ తాజా చిత్రం షూటింగు కూడా హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా సాగుతోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగు కోసం ఆర్ఎఫ్‌సీలో ప్రత్యేక సెట్ వేశారు. 
 
గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ షూటింగులో రజనీతో పాటు కథానాయికలు నయనతార, కీర్తి సురేశ్, ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని బయో బబుల్ పరిరక్షణలో ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తున్నారు. వచ్చే వేసవిలో తమిళనాట జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను పాల్గొంటున్నందున, ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందుగానే రిలీజ్ చేయాలని రజనీ భావిస్తున్నారు.
 
ఈ క్రమంలో షూటింగును త్వరగా పూర్తి చేయడానికి ఆయన చాలా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు అంటే రోజుకు 14 గంటల పాటు రజనీ షూటింగు చేస్తున్నారట. సంక్రాంతికి ముందుగానే తన షూటింగు పార్టును పూర్తి చేయాలని ఆయన ఇలా శ్రమిస్తున్నట్టు చెబుతున్నారు. ఓపక్క అనారోగ్య సమస్యలు వున్నప్పటికీ.. ఈ వయసులో ఆయన ఉత్సాహంగా అలా షూటింగ్ చేస్తుంటే యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు! 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు