సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్ సరసన హీరోయిన్‌గా సమంత నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఇందులో పూజా హెగ్డే ప్రత్యేక పాటలో అలరించనుంది. దేవి శ్రీప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అనసూయ, జగపతి బాబు, ఆది పినిశెట్టిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో 'రంగస్థలం 1985' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం రూ.5కోట్లతో గ్రామం సెట్ వేశారు. అచ్చం 1980లలో ఉన్న గ్రామంలాగే ఆ సెట్ ఉంది. ఈ క్రమంలోనే ఆ గ్రామ సెట్ ఫొటోలను రామ్‌చరణ్ తేజ్ ఇవాళ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ గ్రామ సెట్‌ను చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని చెర్రీ అన్నారు. 1980లోకి ఆ గ్రామం తనను తీసుకెళ్లిందని తెలిపారు.
గ్రామాల్లో ఉండే కిరాణా షాపు, గోలీ సోడా, గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ సీసాలు, ఎద్దుల బండి, పిండి మర, గుడిసెలు ఆ సెట్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు అభిమానుల్లో ఎంతో ఆసక్తిని, అంచనాలను పెంచేస్తున్నాయి.