చిరంజీవి బ్లడ్‌బ్యాంకు చేయూత... రేపు అశోక్ తేజకు ఆపరేషన్

శుక్రవారం, 22 మే 2020 (18:57 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత, అశోక్ తేజ తీవ్ర అస్వస్థతులోనయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు విధిగా కాలేయ మార్పిడి చికిత్స చేయాల్సివుంటుందని వైద్యులు వెల్లడించారు. 
 
అయితే, సుద్దాల అశోక్ తేజకు రక్తం ఎక్కించాల్సి ఉన్నందున దాతల కోసం ప్రకటన ఇచ్చారు. బి నెగెటివ్ గ్రూపు రక్తం కావాలంటూ అందులో పేర్కొన్నారు. ఇది చాలా అరుదుగా లభించే రక్తం కావడంతో తగినంత మోతాదులో నిల్వలేదు. ఈ నేపథ్యంలో అశోక్ తేజకు రక్తం ఇచ్చేందుకు 15 మంది దాతలు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు. ఫలితంగా శనివారం అశోక్ తేజకు కాలేయ మార్పిడి ప్రక్రియ నిర్వహించేందుకు ఏఐజీ వైద్యులు సన్నాహాలు చేస్తున్నారు.
 
కాగా, తన సొంత ఊరు సుద్దాల‌ని త‌న ఇంటి పేరుగా మార్చుకున్న ఈయ‌న 'నమస్తే అన్న' చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు ఉత్తేజ్‌కి సుద్దాల‌ మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో తెలుగు పాటకు అపూర్వ ఘనత తీసుకువచ్చిన సృజనశీలి సుద్దాల అశోక్ తేజ. 
 
కాగా, నటుడు తనికెళ్ళ భరణి వంటి నటుల ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. ఎన్నో అద్భుత‌మైన గేయాల‌తో అల‌రించిన ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. 
 
దర్శకరత్న దాసరి నారాయణ రావు తీసిన రాములమ్మ చిత్రంలోని పాటలన్నీ రాశారు. ఈ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం విజయానికి అశోక తేజ గేయ రచనే అని చెప్పొచ్చు. పైగా, ఈ చిత్రంలో ఆయన ఓ పాటను కూడా పాడారు. 
 
ఇదిలావుండగా, లాక్డౌన్ కారణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రక్తం కొరత ఎక్కువగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో ఇటీవలే పలువురు సినీ హీరోలతోపాటు.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా రక్తదాన చేసి.... ఇతరులు కూడా రక్తదానం చేసేందుకు ముందుకురావాలంటూ పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు