ఈ షో స్టార్ట్ కాకముందు నుంచే వివాదాలు చుట్టి ముట్టాయి. దీంతో అసలు ఈ షోను ఆపేయాలా అనే ఆలోచనలో కూడా పడ్డారు. ఆఖరికి అనుకున్న ప్రకారం షో స్టార్ట్ చేసారు. ఇదిలావుంటే... కాంగ్రెస్ నాయకుడు వీ.హెచ్ నాగార్జున పై ఫైర్ అయ్యాడు. సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర సందర్భంగా మీడియాతో మాట్లాడిన వీహెచ్ బిగ్ బాస్ షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణ సంప్రదాయ బోనాలు హైదరాబాద్‌లో జరుగుతుంటే ఇదే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మహిళలను కించపరిచేలా బిగ్ బాస్ నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఇదంతా డబ్బుల కోసం బిగ్ బాస్ కొనసాగిస్తున్నారంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. అగ్ర హీరోగా అందరి మన్ననలు పొందిన నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్ట్ చేయడం ఏంటని వీహెచ్ ప్రశ్నించారు.
అన్నమయ్య, రామదాసు వంటి సినిమాలు తీసిన నాగార్జునకు ఎందకయ్యా ఇలాంటి షో అని వీహెచ్ నిలదీశారు. అసలు... మహిళలను కించపరిచే ఈ షో పనికిమాలిన షో పోలీసోళ్లు.. కోర్టు ఎలా అనుమతి ఇచ్చారన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఏం చేస్తున్నారు అని నిలదీసారు. మరి... వీ.హెచ్ వ్యాఖ్యలపై ఇటు నాగార్జున కానీ.. అటు కేసీఆర్, కేటీఆర్ కానీ స్పందిస్తారేమో చూడాలి.