సినిమా ఇండస్ట్రీలోకి వీఎఫ్ఎక్స్కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఫిల్మ్ మేకర్స్ అంతా టెక్నాలజీని ఉపయోగిస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాజా హైదరాబాద్‌లో కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు డాక్టర్ మల్లీశ్వర్. ఈ వేడుక శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, దర్శకులు శ్రీనువైట్ల, కరుణ కుమార్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన, నటులు విక్రాంత్ రెడ్డి, రఘు కుంచె హాజరయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ మన తెలుగు బిడ్డ మల్లీశ్వర్ అమెరికాలో స్థిరపడి ఎంటర్పెన్యూర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడి నిరుద్యోగ యువతికి ఉద్యోగాలు ఇప్పించాలని నేను ఆహ్వానించగానే సిద్ధిపేటలో ఐటీ కంపెనీ పెట్టి ఎంతోమంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన డాక్టర్ మల్లీశ్వర్ గారిని అభినందించాలి. మన తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్, హాలీవుడ్‌తో పోటీ పడుతుంది. రాబోయే కాలంలో హాలీవుడ్‌తో మరింత పోటీని ఎదుర్కొవాలంటే.. ఇలాంటి వీఎఫ్ఎక్స్, ఏఐ టెక్నాలజీ చాలా అవసరం. సినిమా బడ్జెట్‌ను తగ్గిస్తూ.. విజువల్ ఎఫెక్ట్స్‌ను పెంచుతూ ప్రేక్షకులు అట్రాక్ట్ చేయాలంటే ఈ టెక్నాలజీ అవసరం ఉంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ వెంట పరుగెడుతుంది. అమెరికా నుంచి ఇండియా వచ్చి ఇది స్థాపించిన మల్లీశ్వర్ ఇంకా ఎదగాలని, చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తనవంతు కృషి చేయాలని కోరుతున్నా. ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రానికి ఆస్కార్ వచ్చిందంటే తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వ కారణం. ఇలాంటి టెక్నాలజీని తెలుగు పరిశ్రమకు రావడం అభినందనీయం అని అన్నారు.
దర్శకులు శ్రీనువైట్ల మాట్లాడుతూ మల్లీశ్వర్ మంచి ఆలోచనతో వీఎఫ్ఎక్స్తో పాటు ఏఐ బ్రాంచ్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ వంతుగా పాలుపంచుకోవడంతో పాటు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అని అన్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన కల్పర వీఎఫ్ఎక్స్ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. దర్శకులు కరుణ కుమార్ మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో వీఎఫ్ఎక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది. టెక్నికల్‌గా మంచి వారిని గుర్తించడం సమస్యగా మారిన ఈ తరుణంలో మల్లీశ్వర్ గారు ఈ కంపెనీ పెట్టడం హ్యాపీ. సరైన క్వాలిటీతో అనుకున్న టైమ్‌కి అవుట్‌పుట్ ఇవ్వగలగితే వారికి కాంపిటీషన్ ఉండదు. ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. రఘు కుంచె మాట్లాడుతూ కల్పర వీఎఫ్ఎక్స్ సంస్థ ద్వారా మల్లీశ్వర్ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేయాలని కోరుకుంటున్నా అని అన్నారు.
హీరో విక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో చిత్ర పరిశ్రమకు వీఎఫ్ఎక్స్ అవసరం బాగా పెరిగింది. వీఎఫ్ఎక్స్ లేని మూవీ అంటూ ఉండదు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ సహా ప్రతి సినీ పరిశ్రమకు మేజర్ సర్వీస్ అందిస్తారని కోరుకుంటున్నా అని అన్నారు.
కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ సర్వీసెస్ సీఈవో డాక్టర్ మల్లీశ్వర్ మాట్లాడుతూ, యూఎస్‌లో నాకు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఏఐ ద్వారా కొన్ని ప్రొడక్ట్స్ డెవలెప్ చేశాం. సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాలని అనుకున్నాం. వీఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఇచ్చే చిత్రాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఇక్కడ బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. హాలీవుడ్లో వాడే టెక్నాలజీని ఇక్కడ కూడా పరిచయం చేస్తున్నాం. ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో దర్శకులు రాజమౌళి, నాగ్ అశ్విన్ కి తెలుసు. తక్కువ బడ్జెట్ సినిమాలకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడాలని మేం అనుకున్నాం. టాలీవుడ్‌తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమవంతు పాత్ర పోషిస్తాం. నా ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ అని అన్నారు