ఆకాశ రామన్న.. బుర్రకు భలే పదును..!!

WD
నటీనటులు: రాజీవ్ కనకాల, అల్లరి నరేష్, శివాజీ, మీరా జాస్మిన్, గౌరీ పండిట్, నాగబాబు, రఘు బాబు, సన, శ్రీనివాసరెడ్డి, రాజేష్, రావురమేష్ తదితరులు, కెమేరా: శ్రీరామ్, కథానువాదం, కథ: అశోక్, నిర్మాణం: మన్యం ఎంటర్ టైన్మెంట్, బ్యాక్ గ్రౌండ్, సంగీతం: చక్రి, నిర్మాత: మన్యం రమేష్.

పాయింట్: ఈ జన్మలో తప్పు చేస్తే వచ్చే జన్మలో శిక్ష పడుతుందనేది పాతమాట. ఈ జన్మలోనే తప్పుకు తగిన శిక్ష విధిస్తాడు విధి అనే కర్మ సిద్ధాంతమే ఆకాశరామన్న కథ.

పనీపాట లేకుండా తేజ( రాజీవ్ కనకాల) పబ్‌లో తాగుతూ చిందులేస్తుంటాడు. అక్కడ పబ్‌లో ఓ స్వామీజీ( రఘు బాబు) తన శిష్యులతో వచ్చి చిందులేస్తుంటాడు. తనకొచ్చిన అనుమానాల స్వామీజీతో చెప్పి తేజ నివృత్తి చేసుకుంటాడు. తప్పు చేస్తే తగిన శిక్ష దేవుడు విధిస్తాడని చెపుతాడు స్వామీజీ.

కానీ తాము అందుకు అతీతులమని స్వామీజి చెప్పిన మరుక్షణంలో కారు యాక్సిడెంట్లో చనిపోతాడు. దాంతో కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని చివరి మాట చెపుతాడు స్వామీజీ. కథాగమనం ఎలా సాగుతుందో ప్రారంభ సన్నివేశంలో తెలిసిపోతుంది. అంటే ఇంకా ఇటువంటి తప్పులు చేసేవారు కొందరున్నారు. వారు ఎన్ని తప్పులు చేశారు. వాటికి తగిన శిక్ష ఎలా పడింది అనేది సినిమా. కాకపోతే ఈ పాయింట్ చెప్పడానికి దర్శకుడు ఎన్నుకున్న కొత్త మార్గం రివర్స్ స్క్రీన్ ప్లే.

ముందు సన్నివేశం చూపాక మళ్లీ అది ఎక్కడ ప్రారంభయిందో తెలియాలంటే... స్టోరీలోకి కాస్త వెనక్కి వెళ్లాలి. అలా అన్ని పాత్రలు వెళ్లి వెళ్లీ చివరికి ఒక పాత్రతో ఒకదానికి ఎలా లింకులున్నాయన్నదే ఈ చిత్రంలో ఆసక్తికరంగా సాగుతుంది.

రాజీవ్ కనకాల తాగుబోతు పాత్రలో బాగా సూటయ్యాడు. డైలాగ్ మాడ్యులేషన్ యాక్సిడెంట్ తర్వాత అతను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ బాగా పండించాడు. కామెడీలో అన్ని పాత్రలు బాగానే రక్తి కట్టించారు. అల్లరి నరేష్ చిలిపి పాత్రలు వేయడంలో దిట్టనే చెప్పాలి. తన ప్రేయసి మీరా జాస్మిన్ దగ్గరకు డబ్బుకోసం ఆమె పని చేస్తున్న షాపింగ్ మాల్‌కు వస్తాడు. అక్కడ ఆమెతో జరిగే సంభాషణ, తర్వాత క్యాష్ కౌంటర్లో డబ్బులు తస్కరించి పిస్టల్‌తో చేతిపై కాల్చి తను తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాడు.

కానీ దొంగతనం ఎవరు చేసిందనేది పోలీసులకు పూసగుచ్చినట్లు తెలిసిపోతుంది. ఇది ఎలా తెలిసింది అనేది తెలియాలంటే... మళ్లీ రీల్ వెనక్కి తిప్పితే... గౌరీ పండిట్ ఈనాటి కల్చర్‌కు అలవాటు పడ్డ అమ్మాయి. ఆమె తన జల్సాలకోసం అటు నరేష్‌ను, మరోవైపు షాపింగ్ మాల్ ఓనర్ శివాజీని ట్రాప్ చేసి వారిద్దరినీ తను గర్భిణీ అని నమ్మించి చెరో ఐదు లక్షలు నొక్కేస్తుంది.

దానికోసం ఆమె వచ్చేటపుడు నరేష్ మీరాను బెదిరించడం చూస్తుంది. మరోవైపు శివాజీ ఆమెకు ఐదు లక్షలివ్వాలనే క్రమంలో ఆమెతో గడిపే తరుణంలో చిన్నపాటి యాక్సిడెంట్‌కు గురవడం... వీటిని పోలీసు అధికారి రావు రమేష్ పెట్రోల్ చేస్తూ అందరినీ పట్టుకుని శిక్షించాలనుకోవడం జరుగుతుంది. కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం శిక్షలన్నీ ఆకాశ రామన్న వేసేస్తుంటాడు. అంటే విధి అన్నమాట.

ఇలా చిత్రగమనం కాస్త గందరగోళంగా ఉంటుంది. సామాన్యుడిగి కన్‌ఫ్యూజ్‌గానే ఉంటుంది. మల్లీప్లెక్స్ సినిమాల కోవలో ఇది చేరుతుంది. ఈ సినిమా చూడాలంటే కాస్త రిలాక్స్ చేసుకుని వెళ్లాలి. లేదంటే చిత్రం ఓ పట్టాన అర్థం కాదు. సస్పెన్స్ థ్రిల్లర్‌లా సాగే ఆ చిత్రం టైమ్‌పాస్ చిత్రం. ఇది ఏ మేరకు జనాలకు ఎక్కుతుందో అనుమానమే. కానీ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో సినిమా తీశారని మాత్రం చెప్పగలం.

వెబ్దునియా పై చదవండి