మంచి ఫీల్‌ ఉన్న సినిమా "జర్నీ"

శుక్రవారం, 16 డిశెంబరు 2011 (19:06 IST)
File
FILE
నటీనటులు: శర్వానంద్‌, జై, అంజలి, అనన్య

సాంకేతిక సిబ్బంది సమర్పణ: 3కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌, సంగీతం: సత్య, మాటలు, పాటలు: సాహితి, సహ నిర్మాత: సిహెచ్‌. ప్రధ్యుమ్న, సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌, నిర్మాత: సురేష్‌ కొండేటి, దర్శకత్వం: శరవణన్‌.

నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మితిమీరిన వేగం ఈ ప్రమాదాలకు కారణమౌతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి. ఈ అంశానికి అద్భుతమైన ప్రేమ కథను జోడించి తమిళంలో రూపొందించిన చిత్రం "ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌". ఈ సినిమా "జర్నీ"గా శుక్రవారం విడుదలైంది.

శర్వానంద్‌ తన స్నేహితుడిని డ్రాప్‌ చేయడానికి హైదరాబాద్‌ బస్టాండ్‌కు వస్తాడు. అక్కడికే వచ్చి తను వెళ్ళాల్సిన సాఫ్ట్‌వేర్ కంపెనీ అడ్రసు తెలీయక తన అక్కతో ఫోన్‌లు మాట్లాడుతుంది అంజలి. అంజలి విలేజ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తుంది. తన అక్క వేరే పనివల్ల రిసీవ్‌ చేసుకోలేక పోతుంది. సిటీలో చాలా జాగ్రత్తతో ఉండాలని సూచనలు కూడా చేస్తుంది.

ఫోన్‌లో అడ్రస్‌ తెలీయక ఆ పక్కనే ఉన్న శర్వానంద్‌ సాయం అడుగుతుంది. ఆ సాయం తనను ఇంటర్వ్యూకు దగ్గరుండి తీసుకుళ్ళేలా చేసుకుంటుంది అంజలి. తన అమాయకత్వం చూసి శర్వానంద్‌ ముగ్దుడవుతాడు. మరోవైపు....జై టెక్నికల్‌ కోర్సు చేసి అప్రంటిస్‌గా పనిచేస్తుంటాడు.

కొద్దిగా దూరమైనా ఎదురింటి అనన్యను జై ప్రేమిస్తాడు. తనను ప్రేమించాలంటే కొన్నింటికి తట్టుకోవాలని అనన్య జైకు పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో నెగ్గిన అతన్ని అనన్య ప్రేమిస్తుంది. జై తన తల్లి దగ్గరకు అనన్యను తీసుకెళ్లడానికి బస్‌ ఎక్కుతాడు. అటువైపు నుంచి అంజలిని వెతుక్కుంటూ శర్వానంద్‌ బస్‌ ఎక్కుతాడు. ఇంటర్వ్యూ ముగించుకుని అంజలి బస్‌ ఎక్కుతుంది.

File
FILE
రెండు బస్సులు వ్యతిరేకదిశలో ప్రయాణం సాగుతాయి. అలా ఒక్కచోట వచ్చేసరికి మితిమీరిన వేగంతో ఈ రెండు బస్సులు గుద్దుకోవడంతో ప్రయాణికులు చాలామంది చనిపోతారు. కొందరికి తీవ్ర గాయాలవుతాయి. తన కళ్ళముందే జై చనిపోవడం, తను చూస్తుండగానే అంజలికి విపరీతగాయాలు కావడం అనన్య, శర్వానంద్‌లు షాక్‌కు గురవుతారు. ఆ తర్వాత ఎవరికి వారు తమవారిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇదీ కథ.

ఇందులో పాత్రధారుల కంటే పాత్రలే కన్పిస్తాయి. ఎవరూ నటించినట్లు ఉండదు. దర్శకుడు స్క్రీన్‌ప్లే చూపించడంలో తగిన శ్రద్ధతీసుకున్నాడు. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే కోపతాపాలు, అనుమానాలు, ప్రవర్తనలు ఇరు జంటల మధ్య బాగా చూపించాడు. సంభాషణలు పొందికగా ఉన్నాయి. క్యాచీగా కూడా ఉన్నాయి. సినిమా ఎక్కువభాగం బస్‌ ప్రయాణంలోనే సాగుతుంది. కనబడిన వారెవరూ మంచివారుకాదనే అమాయకురాలిగా అంజలి బాగా చేసింది.

ఇప్పటి జనరేషన్‌లో ఇటువంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అన్నంత ఆశ్చర్యంలోనూ ఆమెతో ప్రేమలోపడే శర్వానంద్‌ సూటయ్యాడు. వీరిద్దరి వ్యతిరేకమైన మరో జంట జై, అనన్య. నర్సుగా చేస్తూ తన ప్రేమపై ఒక అవగాహన గల ఈనాటి ఫాస్ట్‌ యువతిగా అనన్య బాగా నటించింది. ఒట్టి అమాకుడిగా జై సరిపోయాడు.

దర్శకుడు ఎంచుకున్న భిన్న ప్రేమకథలో లాజిక్కు ఉంది. యువతను బాగా కట్టిపడేస్తుంది. బస్‌ ప్రయాణంలో పయనించే భిన్నరకాల వ్యక్తులు, వారి మనస్తత్వాలు, వారి ఆలోచనలు చాలా సహజంగా ఉన్నాయి. కామెడీ అంటూ ప్రత్యేకంగా ఏమీలేకుండా క్యారెక్టర్ల చేత రన్నింగ్‌లో కామెడీ చేయించడం విశేషం.

సంగీతపరంగా పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. డిజిటల్‌ ఫార్మెట్‌లో తీసిన ఈ చిత్రం లొకేషన్ల అనుగుణంగా బాగా తీశారు. పతాక సన్నివేశాలు హృదయాన్ని పిండేస్తాయి. ప్రేమకథలు చెబుతూ... అందులోనూ జీవితాన్ని చూపించిన ప్రయత్నమే ఈ జర్నీ. ప్రతి ప్రాంతంలోనూ ఒకేచోట ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అవి ఊహకందనిది.

అటువంటి ప్రాంతమే.. చెన్నై టు తిరుచ్చీ వెళ్ళేరహదారి.. అక్కడే నెలకు ఆరు ఏక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఆ ప్రాంతాన్ని దర్శకుడు ఎంచుకుని సినిమాగా తీశాడు. ఇప్పుడు అక్కడే ఆసుపత్రి కూడా కట్టడం విశేషం. చివరగా... మంచి ఫీల్‌ ఉన్న ఈ సినిమా.. ప్రేమికుల్నిచంపేసి విషాదమైన ముగింపు తమిళ ప్రజలకు నచ్చుతుంది. మరి తెలుగు ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి