అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

ఠాగూర్

సోమవారం, 4 ఆగస్టు 2025 (09:15 IST)
తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండ నయీం నగర్‌లోని ఓ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థిన మిట్టపల్లి శివాని (16) ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ నేటి సమాజంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలకు అద్దంపడుతోంది. ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్కగా మార్చి రాసిన ఆ లేఖ చదివితే కంటనీరు పెట్టనివారుండరు. మమ్మీ అంటూ ఆంగ్లంలో మొదలుపెట్టి రాసిన ప్రతి అక్షరంలోనూ ఆమె మనోవేదన కనిపించింది. తల్లిదండ్రులు అర్థం చేసుకోలేని తీరుని, దానివల్ల తాను పడుతున్న గోసను ఆ లేఖలో వివరించింది. తనకు ఇష్టంలేని, అర్థంకాని చదువు చదవలేక ఎలా నలిగిపోయానో ఆ విద్యార్థిని వివరించింది. చివరకు నాకు చావే దిక్కయింది అంటూ ఆ లేఖలో ముగించి తనువు చాలించింది. 
 
"మమ్మీ... చెల్లిని బాగా చదివించండి. మంచి కాలేజీలో మంచి గ్రూపు తీసుకోమను. నాలాగా అర్థం కాని చదువు వద్దు. దాన్ని మంచిగా చదివించి మీరు మంచిగా ఉండండి. కాలేజీలో జాయిన్ చేసేముందు ఎవరినైనా కొంచెం అడిగి జాయిన్ చేయండి. చెల్లి నువ్వు కూడా మంచిగా చదువుకోవే. ఆ చదువు నాకు అర్థం ఐతలే. మీకు చెప్తే మీరు అర్థం చేస్కుంటలే. నాకు మొత్తం టెన్షన్ ఐతాంది. మైండ్ పోతాంది. మీరు చెప్పిన చదువు నాతోని ఐతాలే. నేను చదువుదాం అనుకున్న చదువుకు మీరు ఒప్పుకుంటలే. చివరకు నాకు చావే దిక్కు అయింది. ఏం అర్థం కాకా మధ్యలో నలిగిపోతున్న. ఈ సంవత్సరం అంటే ఏదో మీరు ఫీజు కట్టారు అని ఏదోలా కింద మీద పడివున్న. ఇక నాతోని కాదు. నేను వెళ్లిపోతున్న. నాకు ఇంత తక్కువ మార్కులు రావడం నేను మరియు మీరు తట్టుకోలేరు. అందుకే చనిపోతున్నా. అందరూ జాగ్రత్త. మంచింగా ఉండండి. ఈ ఒక్క సంవత్సరం కూడా మీ కోసమే చదివిన అయినా నాతోని అయితలే. ఎంత కష్టపడ్డా రావడం లేదు. అందరు జాగ్రత్త" అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు