ఇద్దరు స్నేహితులు కలిస్తే సరదాగా చాయ్ తాగుదామ్ అంటుంటారు. అలాగే సరదాగా సినిమా చూసొద్దాం అనే తరహాలో వంశీ సరదాగా కాసేపు చిత్రాన్ని తెరకెక్కించారు. గోపీగోపిక గోదావరి తర్వాత వచ్చిన వంశీ చిత్రమిది. ఆయన శైలిలోనే గోదావరి అందాలు, అక్కడ అలవాట్లు, భాష, సెటైర్లు, కామెడీతో సాగుతుంది. 40 కోట్ల రూపాయలతో సినిమాలు తీసినా రాని రిలీఫ్ మూడుకోట్లతోనూ సినిమా తీసి ప్రేక్షకుల్ని కాసేపు నవ్వుకొనేట్లు చేయవచ్చనేది వంశీ పాలసీ. తెలిసిన కథే అయినా దాన్ని సరదాగా కాసేపు చూసేట్లు చేయడం గొప్ప విషయమే.
పాయింట్: పెళ్లిచూపులకు యజమానికి బదులు డ్రైవర్ వెళితే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది ఆసక్తికరంగా చూపారు.
అక్కినేని, ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లోని పాయింటే ఇది. దానికి గోదావరి అందాలు జతచేసి చూపించడం విశేషం. గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరిలో ఆస్తిపరుడైన గజపతి( జీవా), సనల గారాల కొడుకు శ్రీనివాస్. అమెరికాలో ఎం.బి.ఎ చదివాక తిరిగి ఇంటికి వస్తాడు. కాస్త తిక్క ఎక్కువ. అన్నీ అమెరికా పద్ధతులే పాటించాలనుకుంటాడు. తనతో సమానమైన రిటైర్డ్ జైలర్ రాజారావు( ఆహుతి ప్రసాద్) కుమార్తెను చూడ్డానికి తన కారు డ్రైవర్ రంగబాబు(నరేష్)తో పంపిస్తాడు గజపతి.
అయితే చిన్న ఛేంజ్ అంటూ... డ్రైవర్ పాత్రలో తను, తన పాత్రలో డ్రైవర్ వెళ్లేటట్లు తల్లిదండ్రులతో చెపుతాడు. దీనివల్ల అమ్మాయి ప్రవర్తన తెలుసుకోవచ్చనేది అతడి ప్లాన్. పైగా పది రోజులపాటు అక్కడే ఉండి పరిశీలిస్తానంటాడు. ఈ విషయం రాజారావుకు ఫోన్ చేసి గజపతి చెపుతాడు. ఇంకేముంది. అక్కడికెళ్లిగానే డ్రైవర్‌ను అల్లుడిలా అల్లుడి పాత్రలో ఉన్నవాడిని డ్రైవర్‌లా ట్రీట్ చేస్తారు. అయితే అంతకుముందే చిన్న మార్పు జరుగుతుంది.
కారు ప్రయాణంలో చిన్న పదనిసలు జరగడంతో తన ఐడియాను శ్రీనివాస్ మార్చేసుకుని యధావిధిగా ఎవరి పాత్రల్లో వారు వచ్చేస్తారు. ఈ విషయం తెలీని రాజారావు రంగబాబునే అల్లుడిగా మర్యాదలు చేస్తాడు. అసలు అల్లుడు కావాల్సిన శ్రీనివాస్‌ను డ్రైవర్‌గా చూస్తూ, చిన్న తప్పు చేస్తే పనిష్‌మెంట్ పేరుతో శిక్షిస్తాడు. మరోవైపు రాజారావు సోదరుడు ఎం.ఎస్.నారాయణ దగ్గర చిట్టిబాబు(కృష్ణభగవాన్) లీగల్ ఎడ్వైజర్‌గా ఉంటాడు. ఇద్దరికీ మనస్పర్థల్తో విడదీసి తన పబ్బం గడుపుకుంటుంటాడు. లేని తమ్ముడ్ని ఉన్నట్లు సృష్టించి ఎం.ఎస్ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటాడు చిట్టిబాబు.
ఇదిలా ఉండగా, తనే శ్రీనివాస్‌నని శ్రీనివాస్, డ్రైవర్‌నని రంగబాబు చెప్పినా పరిస్థితుల రీత్యా ఎవరూ నమ్మరు. అయితే అప్పటికే రంగబాబు రాజారావు కుమార్తె మణిమాల( మధురిమ)ను తెగ ప్రేమించేస్తాడు. పెండ్లి వరకూ తీసుక వస్తాడు. చివరి నిమిషంలో అసలు విషయం తెలియడంతో రాజారావు తన కుమార్తెను డ్రైవర్‌కు ఇచ్చి చేయనంటాడు. ఆ తర్వాత రంగబాబు రకరకాల ప్లాన్‌లతో రాజారావుతోపాటు అందరి మనస్సులను ఒప్పించి ఇంటికి అల్లుడైపోతాడు.
నరేష్ తన పేరుముందు అల్లరిని తీసేశాడు. అయితే పాత్రకు తగిన విధంగా చిత్రంలో అల్లరిని చేశాడు. అతని బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథ. అవసరాల శ్రీనివాస్ పాత్రకూడా అంతే చలాకీగా ఉంటుంది. అష్టాచెమ్మలో చేసినంత ఈజీగా చేసేశాడు. మణిమాల పాత్రలో మధురిమ బాగుంది. అమాయకత్వం ఉట్టిపడే పాత్రలో అమరింది. ఇతర పాత్రలన్నీ తగు స్థాయిలో రాణించాయి. రచయిత కృష్ణేశ్వరరావు కామెడీ ఆర్టిస్టుగా ఇందులో మెప్పించాడు.
లోకి ఫోటోగ్రఫీ బాగానే ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరరావు సంభాషణలు ఆకట్టుకున్నాయి. సందర్భానుసారంగా వచ్చే సెటైర్లు, అందుకు తగిన మాటలు సరితూగాయి. సరదాగా కాసేపు సవాలక్ష అనుకుంటాం. అవన్నీ నిజమేనా అంటూ ప్రాణస్నేహితుడి కుమార్తె జీవా తన కొడుకుకి చేసుకోనని చెప్పే సందర్భంలో బాగుంది. చక్రి బాణీలకు భాస్కరభట్ల తదితరుల సాహిత్యం కుదిరింది. ద్వంద్వార్థాల్లేని స్వచ్ఛమైన తెలుగు పాటలు విన్నట్లుంది. అన్ని పాటలు బాగున్నాయి. ఊహలో సుందరీ.. వంటి పాటను దర్శకుడు వంశీ పాడారు. లాజిక్కులు వెతుక్కోకుండా సరదాకోసం వచ్చేవారికి చక్కటి రిలీఫ్ ఈ చిత్రం.