ఆర్టీసీ ఛైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన దళిత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీ ప్రయాణికులకు తేరుకోలేని షాకిచ్చారు. ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్‌లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తనను పట్టించుకోని ఓ ప్రయాణికుడిని చీవాట్లు పెట్టారు. అంతేనా నీదేం కులం.. మీ అయ్య ఏం చేస్తుంటారంటూ ప్రశ్నించారు. దీంతో ఆ ప్రయాణికుడు బిక్కమొహం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'బస్సు ఎక్కాం.. దిగాం.. వాడు మాత్రం మనను చూడలేదు. అది డేంజర్.. వాళ్ల నాన్నకు వీడేమీ ఉపయోగపడడు..' అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆ ప్రయాణికుడి వద్దకు వెళ్లి 'నువ్వు మాల, మాదిగ?' అని ప్రశ్నించారు. 'మీ అయ్య ఏం పనిచేస్తాడు? మీ అమ్మ? ఎన్ని ఎకరాల పొలం ఉంది. బ్యాంకులో ఎన్ని లక్షలు ఉన్నాయి. మరి ఎట్లా చదువుకుంటావు? కష్టపడాలి.. ఫోన్‌లో పాటలు వినడం కాదు' అని మందలించారు.