అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలను ఢిల్లీ పోలీసులు రోడ్లపై ఈడ్చిపారేశారు. అదీ కూడా చొక్కాలు చిరిగిపోయినా సరే.. ఎంపీలను పోలీసులు వదిలిపెట్టలేదు. అక్కడ నుంచి బలవతంగా బస్సులో ఎత్తిపడేసి స్టేషన్‌కు తరలించారు. ఇది ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం ఎదుట ఆదివారం జజరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక నివాసం ముందు తెలుగుదేశం పార్టీ ఎంపీలు మెరుపు ధర్నా చేశారు. పార్లమెంటులో అవిశ్వాసం పెడితే బీజేపీ పారిపోయిందని.. ఇక్కడైనా ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని నినాదాలిస్తూ బైఠాయించారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ముందుగా ప్రకటించకుండా ఒక్కసారిగా 20 మంది ఎంపీలు ప్రధాని ఇంటివైపు దూసుకుకెళ్లి ఆందోళనకు దిగడంతో భద్రతా సిబ్బంది కంగుతిన్నారు. ఉదయం 9.30కు టీడీపీపీ నేత సుజనాచౌదరి ఇంట్లో ఆ పార్టీ ఎంపీలంతా సమావేశమయ్యారు. మెరుపు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రధాని నివాసానికి బయల్దేరారు. వారిని ఎయిర్‌ఫోర్స్ భవన్ వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. బారికేడ్లు అడ్డుగా పెట్టి ముందుకు వెళ్లనివ్వకుండా నిలువరించారు.
దీంతో ఎంపీలైన సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు, సీఎం రమేశ్, తోట నరసింహం, రామ్మోహన్‌నాయుడు, గరికపాటి మోహన్‌రావు, మురళీమోహన్, అవంతి శ్రీనివాస్, నిమ్మల కిష్టప్ప, రవీంద్రబాబు, గల్లా జయదేవ్, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, మాల్యాద్రి, కేశినేని నాని, శివప్రసాద్, జేసీ దివాకర్‌రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. ప్రత్యేక హోదాపై ప్రధానితో చర్చించాలని, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకోవడం సరికాదని భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఎంపీలు ధర్నా చేస్తారని సమాచారం లేకపోవడం, దానికి తగిన విధంగా సిద్ధంగా లేకపోవడంతో పోలీసులు అదనపు బలగాల కోసం కబురు పంపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ నుంచి బలగాలు రంగంలోకి దిగాయి. ధర్నాకు అనుమతి లేదని, వెంటనే వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. టీడీపీ ఎంపీలు ససేమిరా అన్నారు. మోడీ బయటకు వచ్చి హోదాపై స్పందించాల్సిందేనంటూ నినాదాలిచ్చారు. దీంతో వారిని బలవంతంగా లాక్కెళ్లి.. బస్సెక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు.
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఒక అనామకుడిలా అవమానకరంగా ఈడ్చిపారేశారు. రవీంద్రబాబును సైతం మొరటుగా బస్సెక్కించారు. ఇలా ప్రతి ఎంపీని బలవంతంగా బస్సు ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో ఢిల్లీలో ప్రత్యేక హోదా పోరు తారా స్థాయికి చేరింది. మరోవైపు, ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఢిల్లీలో వైకాపా ఎంపీలు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెల్సిందే.