కర్ణాటక ప్రభుత్వానికి ఓ తెలుగు అమ్మాయి షాకులపై షాకులిస్తోంది. ఆమె ఏకంగా ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మంత్రి కార్యాలయానికి ఏకంగా తాళం వేసి వార్తల్లోకెక్కింది. ఆమె దూకుడును తట్టుకోలేని కర్ణాటక ప్రజాప్రతినిధులు పలుమార్లు బదిలీ వేటు వేస్తున్నా... ఆమె మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఆమె తీసుకున్న చర్య ఎన్నికల సంఘం అధికారులే ప్రశంసించేలా ఉంది. ఆమె పేరు రోహిణి సింధూరి దాసరి. కర్ణాటకలో పని చేస్తున్న తెలుగు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్.
ప్రస్తుతం హసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ జిల్లా ఎన్నికల అధికారిగానూ ఉన్న ఆమె.. ఇన్‌చార్జి మంత్రి ఏ.మంజు కార్యాలయానికి తాళాలు వేసి వార్తల్లోకెక్కారు. ప్రభుత్వ స్థలాన్ని ఎన్నికల కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని, ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ పీడబ్ల్యూడీ ఇన్‌స్పెక్షన్ బంగ్లాలోని మంత్రి కార్యాలయంపై రైడ్ చేసి దాన్ని మూసివేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ ఈ కార్యాలయానికి బయట తాళం వేసి ఉన్నప్పటికీ.. లోపల కొందరు ఎన్నికలకు సంబంధించి పనులు చేస్తున్నారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నిజానిజాలు తెలుసుకునేందుకు ఒక బృందాన్ని అక్కడకు పంపాం. లోపల కొందరు పనిచేస్తున్నట్టు గుర్తించాం. ఈ బంగ్లాకు ఇన్‌చార్జిగా ఉన్న పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మంత్రితోపాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి నోటీసులు జారీచేశాం. కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ స్థలాన్ని ఎన్నికల కార్యక్రమానికి ఎందుకు వినియోగిస్తున్నారని వివరణ కోరినట్టు రోహిణి తెలిపారు.
రోహిణి ఇలా రాజకీయ నాయకులకు ఎదురు నిలవడం ఇదే తొలిసారి కాదు. జనవరిలో తనను బదిలీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. హసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన 8 నెలలకే ప్రభుత్వం బదిలీ ఆర్డర్ చేతికిచ్చింది. అయినా ఆమె మాత్రం తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు.